FAUZI: ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజీ’ అర్థం ఏంటీ.. ఈ టైటిల్ ప్రత్యేకత ఏంటీ..?

FAUZI: ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజీ’ అర్థం ఏంటీ.. ఈ టైటిల్ ప్రత్యేకత ఏంటీ..?

దర్శకుడు హను రాఘవపూడి.. తెరకెక్కించే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. గుండెకు హత్తుకునే మాటలతోనే సినిమాలు తీయడంలో హను దిట్ట. అలా వచ్చినవే అందాల రాక్షసి, పడి పడి లేచే మనసు, సీతారామం. ఇటువంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు హను రాఘవపూడి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో మూవీ అనౌన్స్ చేసి, ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు.

‘ఫౌజీ’ (FAUZI):

హను-ప్రభాస్ మూవీకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇవాళ (2025 అక్టోబర్ 13న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించి, మూవీ విశేషాలు వెల్లడించారు. ఈ క్రమంలో ‘ఫౌజీ’ అనే పదానికి అర్థం ఏంటనీ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

"ఫౌజీ" అంటే సైనికుడు (SOLDIER) అని అర్థం. ఇది ఉర్దూ మరియు హిందీ భాషల నుండి పుట్టుకొచ్చింది. సాధారణంగా ‘ఫౌజీ’ అంటే.. సైనిక దళాలకు ధైర్యంగా, వారధిగా నిలిచే సైనికుడి అని అంటారు. అంతేకాకుండా, ఎవ్వరికీ అంతుచిక్కని నైపుణ్యం కలిగిన యోధుడిగా పరిగణించే సందర్భంలో కూడా ఈ పదాన్ని వాడుతారు. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తుండంతో, తన ఆహార్యం, తన పాత్ర స్వభావం ఎలా ఉండనుందో.. టైటిల్ ద్వారా హను రాఘవపుడి చెప్పుకొచ్చారు.

దేశభక్తి, ప్రేమ, త్యాగం, స్వాతంత్ర్యం కోసం ఆ సైనికుడి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. 2026 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 1940 బ్యాక్‌‌డ్రాప్‌‌ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఇదే సరైన రిలీజ్ డేట్‌‌ అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

‘ఫౌజీ’ టైటిల్ ప్రత్యేకత:

టైటిల్ పోస్టర్ను నిశితంగా గమనిస్తే.. ఫౌజీ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలుస్తాయి. బ్రిటన్ జెండా కాలిపోతూ కనిపించింది. ఆ కాలిపోతున్న బ్రిటన్ జెండాపై ఆపరేషన్-జెడ్ అని వాటర్ మార్క్లా కనిపించింది. 1940లో జరిగే కథ ఫౌజీ సినిమా స్టోరీ అని పోస్టర్పై దర్శకుడు స్పష్టంగా మెన్షన్ చేశాడు.

పోస్టర్ పై కూడా 1932 బ్రిటీషర్ల అరాచకాలు పతాక స్థాయికి చేరిన సమయంలో భారతీయుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తులను చేయడం కోసం పోరాడిన యోధుడి కథనే ‘ఫౌజీ’ అని తేలిపోయింది. మన చరిత్రలో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయిన ఒక సైనికుడి ధీర గాథ ‘ఫౌజీ’ సినిమా.. అని హను రాఘవపూడి తన ‘X’ ఖాతాలో మెన్షన్ చేశాడు. 

ఇప్పటిదాకా ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన పోస్టర్లను చూస్తే.. మొదటి పోస్టర్‌లోని తుపాకులు, దానిపై రాసిన ఆపరేషన్ Z, రెండవ పోస్టర్ ఈ సినిమా 1940లో వలస పాలకుల గుప్పిట్లో భారతదేశం చిక్కుకున్న సమయంలో సినిమా సాగుతుందని స్పష్టమైంది.

రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఆపరేషన్ Zకు ఇంపార్టెన్స్ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం.. ఈ రెండు అంశాలకు ఫౌజీ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉందని FAUZI టైటిల్ పోస్టర్తో తేలిపోయింది. ఒక్క పోస్టర్తోనే ఇన్ని విషయాలను బయటపెట్టాడంటే హను రాఘవపూడికి ఈ కథపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా స్టార్ ఇమాన్యీ ఇస్మాయిల్ నటిస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమఖేర్, జయప్రద కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే, వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', అలాగే 'కల్కి 2898 AD' రెండవ భాగం, 'సలార్' సీక్వెల్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. త్వరలో రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.