
- అభిమానులు, అనుచరుల్లో ఆందోళన
- రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాజేందర్‌కు తగ్గిన ప్రాధాన్యం
- గంగులకు మంత్రి పదవితో చెక్
- ఇప్పుడు కుట్ర ప్రకారం తప్పిస్తున్నారనే చర్చ
- ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామన్న అనుచరులు
కరీంనగర్, వెలుగు: ఈటల భూవివాద ఆరోపణలపై విచారణ పూర్తి కాకముందే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం కలకలం రేపింది. దీంతో ఈటల అభిమానులు, అనుచరుల్లో ఆందోళన మొదలైంది. కొంతకాలం నుంచే ఈటలను కావాలని దూరం చేస్తున్నారని.. ఇప్పుడిదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని ఈటల అభిమానులు ఆరోపిస్తున్నారు.
పలు సంఘాల ఆందోళన
ఈటల భూకబ్జా వ్యవహారాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన పలువురు నేతలు ఖండించారు. రాజకీయాల్లోకి రాకముందే వందల ఎకరాల భూములు, ఆస్తులు, కోళ్ల ఫామ్‌లు ఉన్నాయి. కావాలనే ఈటలపై నిందలు మోపుతున్నారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి అవినీతి, ఆరోపణలు లేని ఈటలపై కావాలని రాజకీయ లబ్ధి కోసం ఇలా చేస్తున్నారని ముదిరాజ్ కులస్తులు చొప్పదండిలో నిరసన తెలిపారు. ఈటలపై జరుగుతున్న చర్యలను చూస్తుంటే రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్ర చేసినట్లు ఉందని అంటున్నారు. భూ కబ్జా వ్యవహారంపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం రాజకీయంగా సంచలనంగా మారింది. బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా అంటూ బీసీ సంక్షేమ సంఘం నేత ఎన్నం ప్రకాశ్ ముఖ్యకార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఐదుగురు అగ్రవర్ణాల మంత్రులు, 10 మంది దాకా ఎమ్మెల్యేలు కబ్జాలు చేశారని పత్రికలలో, టీవీలలో వచ్చినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ అగ్రవర్ణ నాయకులు చేసిన భూ కబ్జాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీసీ నేత పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరును వారంతా ఖండించారు.
మొదటి నుంచి పొసుగుతలేదు
పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా తప్పించాలని ప్లాన్లు వేశారు. మంత్రి పదవి కూడా చివరి నిమిషంలో ఇచ్చారు. అదీ శాఖ మార్చారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట తిరిగి.. కార్యక్రమాలను విజయవంతం చేసిన ఘనత ఈటలకు ఉంది. అయినా ఈయనపై చిన్నచూపు మొదలైంది. మంత్రి పదవి వచ్చిన తరువాత కూడా పార్టీ ఓనర్లం అంటూ హుజురాబాద్ లో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి మరింతగా సీఎంకు .. ఈటలకు నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగులకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఈటల హుజురాబాద్ నియోజకవర్గానికి పరిమితం అయ్యేలా చేశారు. ఇలా రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరవాత నెమ్మదిగా ఈటలను బలహీన పరచడం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా భూ కబ్జా విషయాన్ని చూపి మంత్రి పదవి
తొలగించేశారు.
నోరు విప్పని జిల్లా లీడర్లు
ఈటల వివాదంపై ఎవరూ మాట్లాడవద్దని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందోనని టీఆర్ఎస్ నాయకులు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. కానీ ఈ విషయం మీద ఏ నాయకుడు ఇంతవరకు నోరు విప్పలేదు. ఈటల రాజేందర్ కులానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలనే ఆరోపణలు చేస్తున్నారని బహిరంగంగా మాట్లాడుతున్నారు తప్ప రోడ్ల మీదకు వచ్చి మద్దతుగా ఆందోళన చేసిన సంఘటనలు లేవు.
త్వరలో ముఖ్యకార్యకర్తలతో సమావేశం
ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న ఏకైక పార్టీ బీజేపీ. ప్రజలంతా నెక్ట్స్ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక ఈటల రాజేందర్ ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలతో, అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు రాజకీయ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఫామ్ లో బీజేపీలోకి వెళ్తారా.. లేక కొత్త పార్టీ వంటి ఆలోచన ఏమైనా చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈటల కొత్తపార్టీ పెట్టినా... కేసీఆర్ కు మళ్లీ అధికారం ఇచ్చినట్టే. ఎందుకంటే అన్ని పార్టీలు ఓట్లు చీల్చుకుని కేసీఆర్ కు లాభం చేకూర్చినట్టు అవుతుంది. బీజేపీకి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఓట్లు వేసి గెలిపించిన వారి నిర్ణయం మేరకు ఈటల తదుపరి అడుగులు ఉండనున్నాయి. పదవిని సీఎం తీసుకోవడంతో ఈటలే స్వయంగా రాజీనామా చేస్తారా.. చేస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఏమైనా ఉన్నారా తేలాల్సి ఉంది.