విత్తనాలు వేసే టైంలో కొత్త పాలసీ ఏంది?

విత్తనాలు వేసే టైంలో కొత్త పాలసీ ఏంది?

హైదరాబాద్​, వెలుగు: నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు హడావుడిగా కొత్త వ్యవసాయ పాలసీ అనడం ఏమిటని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. విత్తనాలు వేసే టైం దగ్గరపడినప్పుడు ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనడం తుగ్లక్ చర్య అని విమర్శించారు.  ‘‘సీఎం కేసీఆర్ రైతులను బెదిరించే రీతిలో మాట్లాడటం సరికాదు. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు పైసలు ఇచ్చేదిలేదంటూ రైతులను అవమానిస్తున్నరు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే సహించం.. పోరాడుతాం” అని ఆయన హెచ్చరించారు. దరిద్రపు టీఆర్ఎస్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త వ్యవసాయ పాలసీపై ఉత్తమ్​అధ్యక్షతన బుధవారం గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతలు సమావేశమై చర్చించారు. అనంతరం కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్​రెడ్డితో కలిసి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యవసాయ పాలసీ పేరిట రైతులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నరు. ఆ పాలసీలో లోపాలు ఉన్నాయి. దానిపై పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపలేదు. కేసీఆర్​ చెబుతున్న కొత్త పాలసీని కాంగ్రెస్​ వ్యతిరేకిస్తున్నది. ఈ వానాకాలం సీజన్​లో దాన్ని అమలు చేయొద్దు” అని అన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు.

పత్తి ఎందుకు ఎక్కువగా వేయాలి?

పత్తి పంటను ఎక్కువగా సాగు చేయాలని ఎందుకు చెబుతున్నారో స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్​ను ఉత్తమ్​ డిమాండ్​ చేశారు. ‘‘ముందుగా పత్తిని క్వింటాల్​కు రూ. 7 వేలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇవ్వాలి. ఆ తర్వాతే దాని సాగు గురించి చెప్పాలి” అని అన్నారు. మక్క రైతులపై ఆంక్షలు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ చెప్పిన లక్ష రూపాయల పంట రుణమాఫీ హామీని ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. 40 శాతం రైతులకు ఇంకా రైతు బంధు అందలేదని చెప్పారు. మాయమాటలతో రైతులను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. వడ్ల కొనుగోళ్లలో ఫెయిలైన కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

వలస కార్మికులకు బస్సులు

ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా పీసీసీ బస్సులను ఏర్పాటు చేసింది. గాంధీభవన్​ వద్ద ఈ బస్సులను ఉత్తమ్​జెండా ఊపి ప్రారంభించారు. కార్మికులకు ఫుడ్​, పండ్లు, మంచినీళ్లు పంపిణీ చేశారు.

పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం లిఫ్ట్ ఆపండి