ఆధ్యాత్మికం: మానవ శరీరం ఎలా తయారైంది.. ఆత్మకు.. దేహానికి సంబంధం ఏమిటి..!

ఆధ్యాత్మికం:  మానవ శరీరం ఎలా తయారైంది.. ఆత్మకు.. దేహానికి సంబంధం ఏమిటి..!

మనిషి శరీరం ఎలా తయారైంది.. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి.. ప్రాణం పోయిన తరువాత ఆత్మకు ఆధారం ఏమిటి.. పాజిటివ్​ ఆత్మ.. నెగిటివ్​ ఆత్మ లు ఎక్కడ సంచరిస్తాయి..  ఆత్మలు తపస్సు చేస్తాయా.. ఆత్మకు.. దేహానికి సంబంధం ఏమిటి.. పురాణాల్లో ఏముంది..  మొదలగు విషయాల గురించి పురాణాల్లో ఏముంది.. ఆధ్యాత్మిక పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.  .. 

మానవుని జీవితం ఒక అద్భుతమైన రహస్యం...  పురాణాల ప్రకారం.. భూమిపై వీరు చేయాల్సిన కార్యాలు.. మంచి పనులు.. గత జన్మలో చేసిన కర్మలను అనుభవించడానికి ఆత్మ మానవ రూపంలో భూమిపై జన్మిస్తుంది.  షెడ్యూల్​ ప్రకారం.. శ్వాస ఆగిపోయేంత వరకు  కర్మలను అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తాం. 

మానవుని భౌతిక శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో తయారైంది .  మానవుడు మరణించిన తరువాత ఆత్మ పంచభూతాల్లోకి చేరుతుంది. అలాంటి ఆత్మ సూక్ష్మ శరీరంగా మారి కేవలం  మూడు భూతాలతోనే ఉంటుంది .  ఆకాశం, వాయువు, మరియు అగ్ని. ఈ సూక్ష్మ శరీరమే ఆత్మకు నివాసం. మనిషి ప్రాణం పోయిన తర్వాత..  ఈ సూక్ష్మ శరీరమే ఆత్మకు ఆధారం అవుతుంది.  గత జన్మల పాప.. పుణ్యాల ఆధారంగా  మన కోరికలు, వాసనలు, ఆలోచనలు, సంస్కారాలతో నిండి ఉంటుంది.

శరీరం మరణించిన తర్వాత ఆత్మ భూమిపై తిరుగుతూ, కొత్త జన్మ కోసం ఎదురుచూస్తుంది.దీనిలో గత జన్మల వాసనలు, కోరికలు, మోహాలు, మదాలు ఇంకా మిగిలే ఉంటాయి. ఉదాహరణకు, ఎవరికైనా తమ జీవితంలో తీరని కోరికలు  ఉంటే... , వారు మరణించిన తర్వాత కూడా ఆ కోరికల వల్ల భూమిపైనే తిరుగుతారు. ఒక వ్యక్తికి మద్యం అంటే ఇష్టం అనుకోండి...  ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ ఆ కోరికను వదులుకోలేదు. అప్పుడు అది బతికి ఉన్న ఇంకొక మనిషి శరీరంలోకి వెళ్లి మద్యం తాగిన ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అలాంటి ఆత్మలను మనం అశాంతిని కలిగించేవిగా భావిస్తాం.

నెగటివ్ ఆత్మల లోకం..  అశాంతికి మూలాలుగా ఉంటాయి.  మరణించిన తర్వాత తమ కోరికలతో, మోహాలతో తిరుగుతున్న ఆత్మలను  భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు అని పిలుస్తాము. పురాణాలలో, జానపద కథలలో వీటిని భయంకర శక్తులుగా చెప్పారు.  అవి కీడు చేస్తాయని.. భయపెడతాయని.. మానవులు నమ్ముతుంటారు . ఈ నమ్మకాల వెనుక ఒక సత్యం దాగి ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆత్మలలో  ఉన్న ఆకలి...  కోరిక...  కాంక్షల వల్ల ఇవి జీవించి ఉన్న మనుషులపై ప్రభావం చూపుతాయి.
చాలా సార్లు ఇవి ఇళ్లలో గందరగోళం సృష్టిస్తాయి. వస్తువులను పగలగొట్టడం, అల్లరి చేయడం వంటివి చేస్తాయి.  కొన్ని సార్లు మనుషుల శరీరాల్లోకి ప్రవేశించి వారి మానసిక స్థితిని, ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తాయి. దీని వల్ల ఆ వ్యక్తి తన నియంత్రణ కోల్పోతాడు. ఇవి అశుద్ధమైన, నెగటివ్ శక్తులు కాబట్టి శాంతిని ఇవ్వడం కన్నా అశాంతిని, దుఃఖాన్ని కలిగించడం వీటి ప్రధాన లక్షణం.వీటిని దుర్మార్గాలు చేసిన ఆత్మలుగా భావిస్తారు. పాప పుణ్యాల లెక్కలో పాపాలు ఎక్కువగా చేసిన ఆత్మలు ఇవి.భూమిపైనే తిరగడం వల్ల వాటికి పై లోకాలలో ప్రవేశం ఉండదు. అందుకే అవి పీడిత రూపంలో ఉంటాయి.

 మరణానంతరం మరొక రకం ఆత్మలు కూడా ఉంటాయి. వీరు తమ జీవితంలో ఎక్కువగా భక్తి మార్గాన్ని అనుసరించినవారు. వీరినే భక్త ఆత్మలు అని పిలుస్తాము. వీరిలో మమకారం, కోరికలు తక్కువగా ఉంటాయి. వారి జీవితమంతా దైవం కోసం, ధర్మం కోసం అంకితం అయి ఉంటుంది.

ఈ ఆత్మలు దేవాలయాల దగ్గర ఉండి భక్తిని కొనసాగిస్తాయి. సూక్ష్మ లోకంలో కూడా దేవాలయాలు, ఆశ్రమాలు ఉంటాయని వేదాలు చెబుతున్నాయి.భక్త ఆత్మలు తమ భక్తి శక్తితో క్రమంగా పైలోకాలకు ఎక్కుతాయి. నెగటివ్ ఆత్మలకు దుర్గతి వస్తే, భక్త ఆత్మలకు సద్గతి వస్తుంది.వారిలో దుర్గుణాలు లేకపోవడం వల్ల అవి పైకి వెళ్లగలుగుతాయి.వారు భగవంతుని సన్నిధిలో ఆనందంగా ఉంటారు.

భక్త ఆత్మలలో ఉన్నత స్థాయికి చేరిన ఆత్మలు హిమాలయాల వైపు ప్రయాణిస్తాయి. హిమాలయాలు కేవలం పర్వతాలు మాత్రమే కాదు, అవి ఆత్మల తపోభూములు. అమర్నాథ్, కైలాసం, మానససరోవర్, బద్రీనాథ్ వంటి పవిత్ర క్షేత్రాలలో ఈ ఆత్మలు తపస్సు చేస్తాయి. అక్కడ పెద్ద పెద్ద గోళాలను (స్పియర్లను) ఏర్పరచి ఇతర ఆత్మలకు జ్ఞానం పంచుతాయి. ఇవి ఒక రకంగా ఆత్మలకు విద్యాసంస్థలు.ఒక ఆత్మ ఒక లోకం పూర్తిచేసిన తర్వాత తదుపరి లోకానికి ప్రమోషన్ పొందినట్టు ఉంటుంది. ఈ యాత్రలో వారి ఆత్మ మరింత శుద్ధం అవుతుంది.ఈ ఆత్మలు క్రమంగా పై స్థాయిలకు చేరి మహాలోకం, విష్ణుపురి, శివపురి వరకు వెళ్తాయి.

ప్రాచీన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, తత్త్వాలు, యోగ శాస్త్రాలు – ఇవన్నీ ఒకే ఒక సత్యాన్ని మనకు బోధిస్తున్నాయి.   ఈ భౌతిక శరీరం కేవలం ఒక తాత్కాలిక వాహనం మాత్రమే. మనిషి జీవితం ముగిసిన తర్వాత, ఆత్మ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఈ ప్రయాణం మన కంటికి కనిపించే స్థూల లోకాన్ని విడిచి, సూక్ష్మ లోకంలోకి తీసుకెళ్తుంది.

సూక్ష్మ లోకమనే ఈ రహస్య ప్రపంచం మన చుట్టూ, మనలోనే నిక్షిప్తమై ఉంది. ఇక్కడే భూతాలు, ప్రేతాలు వంటివి తిరుగుతాయి. ఇక్కడే భక్త ఆత్మలు దేవాలయాల చుట్టూ సంచరిస్తాయి. ఇక్కడే ప్రళయాల గాథలు ఆవిష్కృతమవుతాయి.  అంతుచిక్కని లోకంలో మనం తెలుసుకోవాల్సిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.
 
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు తెలిపిన వివరాలతో  ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.