భార్య కాన్పు కోసం దాచిన డబ్బులు కట్ చేసిన బ్యాంకర్లు

భార్య కాన్పు కోసం దాచిన డబ్బులు కట్ చేసిన బ్యాంకర్లు
  • భార్య డెలివరీ కోసం దాచుకున్న డబ్బులు కట్ చేశారంటున్న బాధితుడు
  • బ్యాంకర్ల తీరుపై పంచాయతీ కార్యదర్శుల ఆగ్రహం

ఆసిఫాబాద్,వెలుగు:  గ్రామ పంచాయితీ కోసం కొన్న ట్రాక్టర్ లోనుకు సంబంధించి  ఈఎంఐ కట్టలేదని జీపీ సెక్రటరీ సొంత ఖాతా నుంచి బ్యాంకు అధికారులు డబ్బులు కట్ చేసుకున్నారు. ప్రస్తుతం మరో జీపీలో పని చేస్తున్న సదరు సెక్రటరీ తన ఖాతాలోంచి డబ్బులు కట్ అయిన విషయం ఆలస్యంగా తెలుసుకుని లబోదిబో మంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు పంచాయితీ జూనియర్​ పంచాయతీ సెక్రటరీగా మూడేళ్ల కింద పని చేసిన దుర్గం రవి కుమార్​కు  పక్కనే ఉన్న పెద్ద సిద్దాపుర్ జీపీ అదనపు బాధ్యతలు ఇచ్చారు. పల్లె ప్రగతిలో భాగంగా సిద్దాపూర్​ పంచాయితీకి బ్యాంకు నుంచి లోన్​ తీసుకుని  ట్రాక్టర్ , ట్రాలీ, ట్యాంకర్ కొన్నారు. అప్పటినుంచి ఈఎంఐలు కడుతున్నారు. రవికుమార్​ ఆ తర్వాత  బదిలీ అయి వెళ్లిపోయారు. బ్యాంక్ అధికారులు రవి కుమార్  పర్సనల్  అకౌంట్ నుంచి ఈమధ్య  రూ.  37, 511  కట్ చేశారు. కనీసం అతనికి సమాచారం ఇవ్వకుండానే డబ్బులు కట్​ చేశారు. తన బాలెన్స్​లో తేడా గమనించిన అతడు బ్యాంకు ఆఫీసర్లను సంప్రదించాడు. సర్పంచ్​తో పాటు రవికుమార్​జాయింట్అకౌంట్​లో సంతకం చేశారని, లోన్ కట్టకపోవడంతో ఈఎంఐ సొమ్ము  కట్​ చేసుకున్నట్టు  కౌటాల ఎస్బీఐ మేనేజర్ చెప్పారు.

దాంతో రవికుమార్​సిద్ధపూర్ సర్పంచ్ ను, కొత్తగా వచ్చిన  సెక్రటరీని సంప్రదించారు. ఒక నెల డబ్బులు కట్టామని, మరో ఈఎంఐ చెక్​ ట్రెజరీలో ఉందని చెప్పారు. రెండో ఈఎంఐ డబ్బులు బ్యాంకులో జమ​యిన వెంటనే రవికుమార్​ ఖాతాలోంచి కట్​ చేసుకున్న  అమౌంట్ తిరిగి జమ చేస్తామని బ్యాంకర్లు చెప్తున్నారు. సొంత అకౌంట్లనుంచి ఈఎంఐ అమౌంట్​ కట్​ చేయడంపట్ల సెక్రటరీలు ఆగ్రహం వ్యకతం చేస్తున్నారు.  తన భార్య కాన్పు కోసం పొదుపు చేసుకున్న డబ్బులను తనకు తెలియకుండా కట్​ చేయడం దారుణమని, తన భార్యఎనిమిది నెలల గర్భవతి అని, ప్రసవానికి రూ. 2 లక్షలవరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంవల్ల అప్పు చేసి మరీ కూడబెట్టానని  రవికుమార్​ వాపోయాడు.