Asia Cup 2025 final: ఇండియా-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి..?

Asia Cup 2025 final: ఇండియా-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి..?

ప్రపంచ క్రికెట్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఆసియా కప్ తుది సమరంలో ఇరు జట్లు ట్రోఫీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ జట్లు ఫైనల్ కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడంతో మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఎడిషన్‌‌లో దాయాది జట్లు మూడోసారి తలపడనుండడం మరో విశేషం. 

మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరికి..?  

ఆసియా ఫైనల్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ మెగా ఫైనల్ కు వర్షం లేదా ఏదైనా కారణాల వలన మ్యాచ్ రద్దయితే సోమవారం (సెప్టెంబర్ 29) ఆసియా కప్ ఫైనల్ కు రిజర్వ్ డేగా నిర్ణయించారు. సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ జరిపేందుకు వీలు లేకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి. ఫలితం రాలేదు కాబట్టి ఇరు జట్లను సంయక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్ కు ఎలాంటి వర్ష సూచన లేకపోవడంతో మ్యాచ్ మొత్తం సజావుగా సాగే అవకాశం ఉంది. ఈ కాంటినెంటల్ టోర్నీలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు జరిగితే రెండు ఇండియానే గెలిచింది.  

ఫేవరేట్ గా టీమిండియా:
 
టోర్నీలో అజేయంగా నిలిచిన టీమిండియా ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతుండగా, తడబడుతూ ఫైనల్ చేరిన పాక్‌‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా, టోర్నీ ఆరంభం నుంచి మైదానం బయట నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, వివాదాల నడుమ జరుగుతున్న ఈ మ్యాచ్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం ఆట కాదు ‘యుద్ధం మినహా అన్నీ’ అనే రీతిలో వాతావరణం వేడెక్కింది. అయితే, ఎలా గెలిచినా అంతిమంగా విజయం మాత్రమే ముఖ్యమని ఇరు జట్లు భావిస్తున్నాయి. తమ బద్ధ శత్రువు పాక్‌‌ను మూడోసారి ఓడించి ఆసియా కప్‌‌ను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది.

►ALSO READ | ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే.. బీసీసీఐ కొత్త బాస్ గా మిథున్ మన్హాస్..

ఇండియా ప్లేయింగ్ 11:

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా/అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి 

పాకిస్థాన్ ప్లేయింగ్ 11:

సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.