మీరెలాంటివాళ్లో.. నడకచూసి చెప్పొచ్చు

మీరెలాంటివాళ్లో.. నడకచూసి చెప్పొచ్చు

మీ వ్యక్తిత్వం ఏంటి..?.. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ప్రశ్నలే ఇవి. అయితే ఈ ప్రశ్నలకి సమాధానం మనం నడిచే పద్ధతిలోనే ఉంది. నడకకి, వ్యక్తిత్వానికి లింకేంటి? ఉంది మరి. ఇది నిజం. మనమెలాంటి వాళ్లమో మన నడక చెప్పకనే చెబుతుందంటున్నారు పరిశోధకులు.

కొందరు వ్యక్తులు పక్కవాళ్లకు దొరక్కుండా అడుగులు వేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతుంటారు. నడకలో వారిని అందుకోవడం పక్కవాళ్లకి అసాధ్యమే. అయితే, అలాంటి వాళ్లు జీవితంలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. అందరూ తనతోపాటే ఉండాలనుకునే మనస్తత్వం వీళ్లది. వీళ్లలో కలుపుగోలు తనం , ఆత్మవిశ్వాసం ఎక్కువని పరిశోధకులు చెప్తున్నారు.

నత్తనడకలు

కొందరు నడవలేక నడవలేక అడుగులో అడుగేసుకుంటూ నడుస్తుంటారు. చాలా ప్రశాంతంగా అడుగులేస్తారు. అలాంటి వాళ్లు జీవితంలో ఎక్కువగా విశ్రాంతినే కోరుకుంటారు. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేందుకే చూస్తారు. ఇంకోటేంటంటే.. ఇలాంటి వాళ్లకు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశముంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

సౌండ్ పొల్యూషన్​

శబ్దాలు చేసుకుంటూ, ఠపీఠపీమని నేలను తన్నుతూ వేగంగా దూసుకెళ్లిపోయేవాళ్లు మన చుట్టూ ఎక్కువగానే కనిపిస్తారు. వీళ్లు నడుస్తుంటే చుట్టు పక్కల వాళ్లంతా వీళ్ల వైపే చూస్తారు. పది అడుగుల దూరంలో ఉన్నా వీళ్ల అడుగుల శబ్దం వినపడుతుంది. ఇలాంటి వాళ్లు ఎక్కువగా కోపిష్టులు. మొహంలో ఎప్పుడూ ఏదో ఒక చిరాకు ఉంటుంది. అంతేకాదు.. చిన్న పిల్లల చేష్టల్లా ఉంటుందట వీళ్ల ప్రవర్తన.

సిగ్గుపడుతూ

తలదించుకుని అడుగులు వేయరాదన్న రీతిలో నడుస్తుంటారు ఇంకొందరు. అలాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసం మాట దేవుడెరుగు.. కనీసం నోట్లో నుంచి మాట కూడా మెదపలేరు. వీళ్లకు సిగ్గు టన్నుల కొద్దీ ఉంటుంది. పదిమంది చూస్తుంటే నడవడానికి కూడా ఇబ్బంది పడతారు . వీళ్లు వేగంగా నడిస్తే మంచిదని సూచిస్తున్నారు పరిశోధకులు.

చేతులు కట్టుకుని

క్లాస్​ టీచర్​ ముందు చేతులు కట్టుకున్నట్టు రోడ్డుమీద కూడా చేతులు కట్టుకుని నడుస్తుంటారు కొందరు. ఇలాంటి వాళ్లు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు చాలా ముభావంగా ఉంటారు వీళ్లు. కానీ ఇలా నడిచే వాళ్లే దాడులకు ఎక్కువగా గురవుతారంటున్నారు పరిశోధకులు. రాత్రిళ్లు ఇలా చేతులు కట్టుకుని ముభావంగా నడవడం వల్ల ఎవరైనా దాడి చేస్తే ఎదుర్కోవడానికి అవకాశం కూడా ఉండదంటున్నారు. అందువల్ల వీళ్లు కాస్త వేగం పుంజుకుని చేతుల్ని కిందకు దించి నడవాలి.

మల్టీ టాస్కర్​

ఫోన్​ మాట్లాడుతూ, పాటలు వింటూ రోడ్డు మీద పరుగులు తీసేవాళ్లు తరచూ కంటబడుతూనే ఉంటారు. కేవలం పాటలు, ఫోనే కాదు చేతిలో పుస్తకం పట్టుకుని చదువుతూ, పక్కన వాళ్లకి డైరెక్షన్స్​ చెప్తూ రోడ్డు క్రాస్​ చేస్తారు వీళ్లు. ఇలాంటి వాళ్లల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే సామర్థ్యం వీళ్లకే సొంతం. సాయం చేయడానికి కూడా వీళ్లు ముందుంటారు.

డ్రీమర్​

పక్కనుంచి ఐదారు బుల్డోజర్లు పోతున్నా చలనం కూడా ఉండదు వీళ్లలో. ఏవేవో ఆలోచనల్లో ముగిపోయి, ఊహల్లో బతుకుతుంటారు. నడకతో పాటు వీళ్ల ఆలోచనలు కూడా కదులుతూనే ఉంటాయి. చేతిలో ఫోన్​ మోగినా ఆలోచనలకు ఎక్కడ ఆటంకం కలుగుతుందని పట్టించుకోరు వీళ్లు. ఇలాంటి వాళ్లు ఊహల్లోనే ఎక్కువగా బతుకుతారు. ఆలోచనల్లోనే వీళ్లని వీళ్లు బంధించుకుంటారు.

చిల్

భుజానికి బ్యాక్​ ప్యాక్​, పాకెట్స్​లో చేతులు, చెవిలో హెడ్ ఫోన్స్​తో రిలాక్స్​గా నడుస్తుంటారు వీళ్లు. అడుగులు కూడా డ్యాన్స్​ మూమెంట్స్​లా ఉంటాయ్​. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ ఫుల్ జోష్​లో ఉంటారు. పంచ్​లు కూడా బాగా పేలుస్తారు. కానీ నచ్చిన వాళ్లతో మాత్రమే కలుస్తారు. పెద్దగా పరిచయం లేని వాళ్లు. అపరిచితులతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు.

ప్రశాంతంగా

పక్కనవాళ్ల చేతిలో చెయ్యి వేసి నెమ్మదిగా, నేల కందిపోకుండా మృదువుగా నడుస్తుంటారు కొందరు. ఇలాంటి వాళ్లు వాళ్లకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ పక్కన వాళ్లని నవ్విస్తుంటారు. వీళ్లకి ఇన్​ఫ్లుయెన్స్​ పవర్స్​ కాస్త ఎక్కువే అంటున్నారు పరిశోధకులు.

వంకర టింకరగా

కొందరు నడుస్తూ నడుస్తూ సడెన్​గా డైరెక్షన్​ ఛేంజ్​ చేస్తారు. ఎంతసేపటికి కుడివైపుకే నడుస్తారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడి ఫీలవుతారు. వీళ్ల మైండ్​లో కన్ఫ్యూజన్​ ఎక్కువగా రన్​ అవుతుంది.

స్ట్రయిట్​గా

తలపైకి ఎత్తి, ఛాతిని ముందుకు చాపి, భుజాలను వెనక్కి ఉంచి ‘ఏదైతే ఏంటి’ అన్నట్టు నడుస్తుంటారు కొందరు. ఇలాంటి వాళ్లు ఎలాంటి ఛాలెంజ్​నైనా నవ్వుతూ స్వీకరిస్తారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు వీళ్ల మాటలు ఇతరులను చాలా ప్రభావితం చేస్తారు. నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్లు చాలా త్వరగా బోర్​ ఫీలవుతారని పరిశోధకులు చెప్తున్నారు.