లంకను గట్టెక్కించే ఘనుడెవరు ?

లంకను గట్టెక్కించే ఘనుడెవరు ?

శ్రీలంకలో మే 9న ప్రధానమంత్రి  మహింద రాజపక్స  రాజీనామా.. 

మే 12న కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘేకు బాధ్యతలు..

జులై 13న  అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పరార్..  

తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే.. 

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో గత రెండు నెలల వ్యవధిలో రాజకీయాలు రోజుకో మలుపు తిరిగాయి. అధ్యక్ష పదవి నుంచి గొటబాయ తప్పుకోవడంతో పరిణామాలు చకచకా మారిపోయాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి, అధ్యక్ష హోదాల్లో ఒకే వ్యక్తి ఉన్నారు. ఆయనే రణిల్ విక్రమ సింఘే.  ఏ లెక్కన చూసుకున్నా ఆయనకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)కి పార్లమెంటులో మెజారిటీ లేదు. 2020లో జరిగిన శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో యూఎన్పీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కేవలం ఎన్నికల్లో సాధించిన ఓట్ల లెక్కన రణిల్ విక్రమ సింఘేను పార్లమెంటుకు నామినేట్ చేశారు. రాజకీయ సంక్షోభ సమయాల్లో ట్రబుల్ షూటర్గా పేరున్న ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స ప్రకటించారనేది విస్పష్టం. 45 ఏళ్లుగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఇది ఐదోసారి. ఆయనకు ప్రతిపక్ష సమాగీ జన బలవేగయా (ఎస్జేబీ), అధికార పార్టీ శ్రీలంక పొడుజన పెరమున(ఎస్ఎల్పీపీ) , ఇతర పార్టీలు మద్దతిస్తున్నాయి.

ప్రజల్లో తీవ్ర అసహనం

ఆర్థిక సంక్షోభంతో బతుకులు చితికిపోయి తీవ్ర ఆగ్రహంలో ఉన్న లంక ప్రజలు ఇప్పుడు తీవ్ర అసహనంలో ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా వారు వినే పరిస్థితుల్లో లేరు. ఇటువంటి తరుణంలో కొత్త ఆర్థిక విధానాలు, రాజకీయ చాతుర్యంతో దేశాన్ని గట్టెక్కించే నేర్పరితనం రణిల్ కు ఉందన్నది విశ్లేషకులు అభిప్రాయం. అయితే చాలా ప్రజా సంఘాలు ‘రణిల్ గో బ్యాక్’ అని నినదిస్తున్నాయి. ఆయనను కూడా రాజపక్స కుటుంబానికి తొత్తు అని అభివర్ణిస్తున్నాయి.  దేశంలో కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గంలో తమ కుటుంబీకులు ఉండబోరని జులై 13న మాల్దీవుల నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో గొటబయ రాజపక్స ప్రకటించినప్పటికీ .. ప్రజలు దాన్ని నమ్మే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో శ్రీలంకను ఆర్థిక సంక్షోభం ఊబి నుంచి బయటపడేసే భావి నాయకుడు ఎవరు ? అనే దానిపై హాట్ డిబేట్ జరుగుతోంది. 

రాజపక్స కుటుంబంపై తీవ్ర జనాగ్రహం.. 

శ్రీలంకలో ప్రభుత్వ వ్యవస్థలన్నింటిపైనా ప్రజాగ్రహం నెలకొంది. ప్రభుత్వ విధానాల్లో వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిందనే భావన జనంలో గూడుకట్టుకుపోయింది. అందుకే గొటబాయ రాజపక్స తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రతిపాదించిన రణిల్ విక్రమ సింఘేను నమ్మే  స్థితిలో జనం లేరు. రాజపక్స కుటుంబం పేరు చెబితేనే లంక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 2019 ఎన్నికల్లో రాజపక్స కుటుంబం గ్రిప్ లో ఉన్న శ్రీలంక పొడుజన పెరమున(ఎస్ఎల్పీపీ)  పార్టీ మెజారిటీ సాధించింది. అప్పటి నుంచి ప్రత్యక్షంగా ఆ కుటుంబానికి చెందిన 18 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కీలకం కాని పదవులనూ కలుపుకుంటే.. మొత్తం 40 మంది రాజపక్స కుటుంబీకులకు సర్కారీ పదవులు దక్కాయి. వారంతా భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు జరగకపోవడంతో శ్రీలంక దివాలా తీసింది. దేశానికి కేవలం అత్యవసర వస్తు, ఉత్పత్తులే దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంధన కొరత కారణంగా ప్రజల వెతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజపక్స కుటుంబం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రతిపాదించిన రణిల్ విక్రమ సింఘేను ప్రెసిడెంట్ గా అంగీకరించేందుకు శ్రీలంక ప్రజానీకం ససేమిరా అంటున్నారు. జులై 9న ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనను అందుకు నిదర్శనంగా భావించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

యాక్టివ్ అయిన సైన్యం.. 

ఎన్నడూ లేని విధంగా శ్రీలంక సైన్యం యాక్టివ్ అయింది. ప్రజలు శాంతియుతంగా ఉండాలని శ్రీలంక సైన్యాధ్యక్షుడు ప్రకటన చేశారు. సైన్యం నుంచి ఈ విధమైన ప్రకటన  వెలువడటం అసాధారణం.  అందువల్ల పాలనా పగ్గాలపై సైన్యం కన్నేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాబోయే అధ్యక్షుడు ఎవరు ? 

జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని స్పీకర్ మహింద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈనెల 15న పార్లమెంటు సమావేశమై.. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ప్రకటన చేయనుంది. 19న నామినేషన్ల స్వీకరణ, 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజపక్స కుటుంబం ప్రాతినిధ్యం వహించే శ్రీలంక పొడుజన పెరమున(ఎస్ఎల్పీపీ)  పార్టీకి అధ్యక్ష రేసులో వెనుకంజ తప్పేలా లేదు. ఈ రేసులో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తి పేరు సజిత్ ప్రేమదాస. ఆయన ప్రధాన  ప్రతిపక్షం ‘సమాగీ జన బలవేగయా’ (ఎస్జేబీ)కు చెందిన నాయకుడు. 2019లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో 2019 జనవరి 3 నుంచి ఆయన శ్రీలంక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. సజిత్ ప్రేమదాస లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో పీజీ చేశారు. ఒకవేళ అధ్యక్ష పదవి వరిస్తే.. ఆయనకున్న అనుభవంతో శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.