ఇండియాలో వాట్సాప్ డౌన్

ఇండియాలో వాట్సాప్ డౌన్

ప్రపంచంలో పాపులర్ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సాంకేతిక లోపంతో కొంత సమయం డౌన్ అయింది. సాయంత్రం దాదాపు 5 గంటల నుంచి భారత్ సహా పలు దేశాల్లో కొందరు యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. దీంతో జనం ఒక్కసారిగా ట్విట్టర్‌పై పడ్డారు. వాట్సాప్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌ (#Whatsappdown)తో ట్వీట్లు హోరెత్తించారు. కేవలం రెండు గంటల్లోపే 76 వేల మందికి పైగా ఈ హ్యాష్ ట్యాగ్‌ పెట్టి ట్వీట్స్ చేశారు. దీంతో ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

టెక్ట్స్ మెసేజ్‌లకు ఓకే

భారత్, ఇండోనేషియా, బ్రెజిల్, మలేసియా, పలు యూరప్ దేశాల్లో కొన్ని గంటల పాటు వాట్సాప్ డౌన్ అయింది. ఫొటోలు, వీడియోలు, జిఫ్స్ వంటివి సెండ్ కాలేదు. అయితే టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాలేదని తెలిసింది.

ట్విట్టర్‌లో సెటైర్లు

వాట్సాప్ డౌన్ కావడంతో చాలా మంది ట్విట్టర్‌లో ఫన్నీ పోస్టులు, మెమ్స్ పెట్టారు. యాప్ పని చేస్తోందో లేదో చెక్ చేసుకోవడానికి ట్విట్టర్‌లో సెర్చ్ చేస్తున్నానంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. లవర్ పంపిన ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నానంటూ ఒకరు సరదాగా ట్వీట్ పెట్టగా.. వాట్సాప్ పని చేస్తుందో లేదోనని ట్విట్టర్‌లో చెక్ చేస్తుంటే రీ ట్వీట్ చేయండని మరొకరు పోస్టులు పెట్టారు. మరికొందరైతే ఫేస్‌బుక్ ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్‌ను ఎవరి దగ్గర కొన్నాడో వాళ్లకే రిటర్న్ చేసేసి, ఫేస్‌బుక్‌పై దృష్టి పెడితే మేలని సెటైర్లు వేశారు. కొందరైతే ఏకంగా వాట్సాప్‌కి సమాధి కట్టేశారు.