కొత్త ఐటీ రూల్స్: కేంద్రంపై వాట్సాప్ ఫిర్యాదు

కొత్త ఐటీ రూల్స్: కేంద్రంపై వాట్సాప్ ఫిర్యాదు

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ ను తీసుకొచ్చింది. బుధవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని కోరిన వాట్సాప్‌.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేసినట్లు జాతీయ మీడియా ద్వారా తెలిసింది. కొత్త నిబంధనలు యూజర్ల వ్యక్తిగత భద్రతకు, సమాచార గోపత్యకు భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సాప్‌ ఆరోపిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫిర్యాదును వాట్సాప్‌ దాఖలు చేసిందా.. దీనిపై కోర్టు ఎప్పుడు విచారణ జరపనుందన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

కొత్త ఐటీ రూల్స్ ఇవీ..
ప్రతి సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు చేపట్టాలి. ఈ రూల్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూ వర్తిస్తాయి. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇతర సంస్థలు గ్రీవియన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ను నియమించాలి. ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు వాటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలి.