
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ఇండ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇండ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్ పై కొత్త సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేసి10 రోజులు దాటినా.. అధికారులు ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పంపిణీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమైనా మారుస్తారా? అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గ్రేటర్ వ్యాప్తంగా లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్లాన్చేసింది.
ఇందులో భాగంగా 49 మురికి వాడల్లో 9,828 ఇండ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. 65 వేల ఇండ్ల నిర్మాణం పూర్తవగా, 24 ప్రాంతాల్లో 4 వేలకిపైగా ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. ఇప్పటివరకు ఇండ్లు పొందినవారంతా గతంలో మురికివాడల్లో గుడిసెలు ఉన్నావారే. సిటీలో అద్దెకు ఉంటున్న నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా అందలేదు. అత్యధికంగా కొల్లూరు సైట్లో15,600 ఇండ్లు నిర్మించగా, నిరుపేదలకు దాదాపు ఇక్కడ అందుతాయని ప్రతి సమావేశంలో మంత్రులు చెబుతూ వస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇవ్వాల్సి ఉంది. 15,600 ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయి ఆరు నెలలు దాటుతున్నా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు.
7 లక్షలకు పైగా అప్లికేషన్లు
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మొత్తం 7.10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. బల్దియా అధికారులు వెరిఫికేషన్పూర్తిచేసి, వివరాలను రెవెన్యూ అధికారులకు పంపించారు. 2 లక్షలకి పైగా అప్లికేషన్ల వెరిఫికేషన్ జరగలేదు. అప్లికేషన్లలో మెన్షన్చేసిన అడ్రస్‌లలో దరఖాస్తుదారులు లేకపోవడం, ఫోన్లు చేసినా కలవకపోవడం ఇలా వివిధ కారణాలతో పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే దరఖాస్తు చేసుకొని వెరిఫికేషన్ కానీ వారికి వేరే విధంగా ఏదైనా అవకాశం కల్పిస్తారా? లేదా అన్న దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వడంలేదు.
పూర్తయినా ఇవ్వట్లే..
ప్రస్తుతం చాలాచోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయడం లేదు. ఎవరు లబ్ధిదారులు అన్నది గుర్తించడంలేదు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరు ఇండ్లను పంణీ చేస్తారని మంత్రి కేటీఆర్ప్రకటించి ఏడాది దాటింది. పూర్తిచేసిన ఇండ్లను ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. అర్హులకు త్వరగా అందజేయాలని కోరుతున్నారు. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమకు సంబంధం లేని సెక్యూరిటీ డ్యూటీకి సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని బిల్డర్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చేలా ప్లాన్?
సరిగ్గా ఎన్నికలకు ముందు పంపిణీ చేస్తే.. లబ్ధిదారులు తమవైపే ఉంటారని అధికార పార్టీ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇండ్లు రెడీ అయినా ఇవ్వడం లేదని తెలుస్తోంది. నెలలో పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పి ఏడాది అవుతోంది. లబ్ధిదారులు ఏండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఓట్ల కోసం పేదలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్కాదని ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. లక్షల్లో దరఖాస్తులు రాగా, 65 వేల మందికి మాత్రమే ఇండ్లు ఇస్తే మిగిలిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.