పుల్వామా దాడిపై స్వార్థ రాజకీయాలు చేశారు

పుల్వామా దాడిపై స్వార్థ రాజకీయాలు చేశారు

కెవాడియా: గతేడాది పుల్వామాలో భారత సైనికుల మీద జరిగిన ఉగ్రదాడిపై విపక్షాల వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఆ దాడిలో 40 మంది పారామిలిటరీ సైనికులు చనిపోయిన వేళ.. ప్రతిపక్షాలు బాధను వ్యక్తం చేయకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. గుజరాత్, కెవాడియాలో నిర్వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 145వ జయంతి ఉత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్వామా అటాక్‌‌‌తో పాటు ఆ సమయంలో విపక్షాలు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు.

‘ఈరోజు ఆఫీసర్ల పరేడ్ చూస్తున్నప్పుడు నా మెదడులో ఒకే సన్నివేశం మెదిలింది. అది పుల్వామా దాడికి సంబంధించింది. భరతమాత ముద్దు బిడ్డలు చనిపోయిన ఆ రోజును ఎవ్వరూ అంత త్వరగా మర్చిపోరు. అలాంటి విషాద సమయంలో కొందరు భాగస్వామ్యం కాలేదు. పుల్వామా అటాక్ నుంచి స్వీయ లబ్ధి పొందాలని వారు యత్నించారు’ అని మోడీ చెప్పారు. దు:ఖ సమయాన విపక్షాల నుంచి కొందరు చేసిన కామెంట్స్‌‌ అందర్నీ బాధించాయని మోడీ పేర్కొన్నారు. మన జవాన్లపై జరిగిన దాడిని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.