ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఓవైపు టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తుండగా.. మరోవైపు అధినేత చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ( జూన్ 14) వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అంత అవినీతి పరుడు దేశంలో ఎవరూ లేరని సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్నారు. సీఎం అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటన చేయడం కాదు జగన్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలన్నారు.
పీకల్లోతు అవినీతిలో వైసీపీ ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా...ఖబడ్దార్ అని చంద్రబాబు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. రెండు వేల రూపాయల నోట్లు వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రకటించిన మిని మేనిఫెస్టోలో మహిళ, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పధకాలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. ఈ సంక్షేమ పధకాల్ని కుప్పం నుంచే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
