పోతిరెడ్డిపాడుపై మాట్లాడేందుకు టైమ్​ ఎప్పుడొస్తది?

పోతిరెడ్డిపాడుపై మాట్లాడేందుకు టైమ్​ ఎప్పుడొస్తది?

హైదరాబాద్, వెలుగుపోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే తెలంగాణలోని కరెంటు ప్రాజెక్టులు సచ్చిపోతాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల… ఏపీ సీఎం జగన్‌‌‌‌కు నీళ్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు నిధులు, కేసీఆర్ కుటుంబానికి నియామకాలు వచ్చాయని విమర్శించారు. ప్రజలకు మాత్రం ఏమీ రాలేదన్నారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌.. చంద్రబాబు చెప్పులు మోశాడని.. వైఎస్‌‌‌‌కు మూటలు మోశాడని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నాడన్నారు. మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం టీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌‌‌‌ది అని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే కరెంటు సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఈ విషయం అపర మేధావి కేసీఆర్, బాల మేధావి కేటీఆర్‌‌‌‌కు తెలియడంలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరెంటు రంగంలోని నిపుణులు దీనిపై మాట్లాడాలని కోరారు. కేసీఆర్‌కు బాగా తెలిసింది నీళ్ల గురించి కాదని.. లిక్కర్ బ్రాండ్ల గురించి బాగా తెలుస‌‌‌‌న్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపునకు వ్యతిరేకంగా జూన్ 2న ప్రాజెక్టుల వద్ద నిరసనలు తెలుపుతామని చెప్పారు.

సీఎం అయ్యాక ఏం జేసినవో చెప్పు?

‘రాష్ట్రానికి అన్యాయం జరిగేలా పోతిరెడ్డిపాడు కెపాసి టీని ఏపీ సర్కారు పెంచుతుంటే కేసీఆర్ టైమ్‌‌‌‌ వచ్చినప్పుడు మాట్లాడుతా అంటున్నడు. మాట్లాడే టైమ్‌‌‌‌ ఎప్పుడొస్తది, ఎన్నికలప్పుడేనా? పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతూ ఏపీ ఇచ్చిన 203 జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారవుతదని కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశాం. కేఆర్‌‌‌‌ఎంబీ తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించింది. ఏపీకి కేటాయించిన నీటినే పోతిరెడ్డిపాడుతో తరలిస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ చెబుతున్నాడు. కేసీఆర్ దాన్ని సమర్థిస్తున్నాడు. వైసీపీ ఎమ్మెల్యే రోజా పెట్టిన రాగి సంగటి తిని కేసీఆర్ బలిసి మాట్లాడుతున్నాడు.  సీఎం అయ్యాక ఏం చేశాడో చెప్పాలి. సీఎంకు ప్రెస్‌‌‌‌మీట్లు టైమ్‌‌‌‌పాస్‌‌‌‌గా మారాయి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా మమ్మల్ని స్పీకర్ అడ్డుకున్నారు. మేం పారిపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నాడు’ అని రేవంత్ చెప్పారు.

కరెంటు ప్రాజెక్టులను చంపే కుట్ర

పోతిరెడ్డిపాడు వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్‌ ఆరోపించారు. ‘శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కరెంటు వినియోగం ప్రకారం ప్రాజెక్టుల విభజన చేయాలని కాంగ్రెస్​ దివంగత నేత జైపాల్‌‌‌‌రెడ్డి ఆనాడు సూచించారు. అప్పుడు తెలంగాణలో 54 శాతం కరెంటు వినియోగం ఉండే. దాని ప్రకారమే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇచ్చారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు వద్ద బొక్కపెట్టి జగన్ నీళ్లు తీసుకువెళ్తా అంటున్నాడు. అదే జరిగితే శ్రీశైలంకు చుక్క నీరు రాదు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది, తెలంగాణ చీకటి అవుతుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల కరెంటు ప్రాజెక్టులను చంపేసే కుట్ర చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి కేసీఆర్ కొత్త విద్యుత్ ప్రాజెక్టుల కోసం ప్లాన్ చేస్తున్నాడు. అందుకే నీటి తరలింపుకు అంగీకరిస్తున్నారు. దీని వెనక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల లాబీయింగ్ ఉంది’ అని అన్నారు.

సర్కారు పంట రూల్స్ తో రైతుకు తిప్పలే