- బర్నింగ్ స్మెల్ అని అనుకొని కొచ్చిలో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- కొచ్చి నుంచి షార్జా వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఘటన
కొచ్చి(కేరళ): టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమా నంలో కాలిన వాసన (బర్నింగ్ స్మెల్) రావడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందని అధికారులు గురువారం తెలిపారు. ఆగస్టు 2 రాత్రి (బుధవారం) కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి షార్జాకు 175 మంది ప్రయాణికులతో ఎయిరిండి యా విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్‌లో బర్నింగ్ స్మెల్ వస్తోందని ఓ ప్యాసింజర్ గుర్తించాడు. అతను తోటి ప్రయాణికులకు చెప్పగా, వారికి కూడా ఆ వాసన రావడంతో వెంటనే సిబ్బందికి తెలియజేశారు. వారు పైలట్‌కు చెప్పడంతో తిరిగి కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్‌ను సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని అధికారులు తనిఖీ చేయగా, ఎలాంటి బర్నింగ్ స్మెల్ రావడం లేదని గుర్తించారు. అయితే, కార్గోలో తరలిస్తున్న ఉల్లిగడ్డలు, కూరగాయల నుంచి వాసన వస్తుంది తప్ప కాలిన స్మెల్ రావడం లేదని చెప్పారు. ఉల్లి నుంచి వచ్చిన ఆ ఘాటు వాసనే బర్నింగ్ స్మెల్ అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కులల్‌నాదన్ మాట్లాడుతూ, బర్నింగ్ స్మెల్ వస్తుంది అని తెలియగానే, ఫ్లైట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత ఏరిండియా అధికారులు ఫ్లైట్‌లో ఉన్న 175 మంది ప్యాసింజర్లకు వేరే విమానం ఏర్పాటు చేసి, షార్జా పంపించారు.
