పత్తి కొనుగోళ్లు ఇంకెప్పుడు?.. క్లారిటీ ఇవ్వని మార్కెటింగ్ శాఖ, సీసీఐ

పత్తి కొనుగోళ్లు ఇంకెప్పుడు?.. క్లారిటీ ఇవ్వని మార్కెటింగ్ శాఖ, సీసీఐ
  • ఈనెల మొదట్లోనే షురూ కావాల్సి ఉన్నా పట్టించుకోలే
  • పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఇంకా మొదలు కాలేదు. ఈ నెల ప్రారంభంలోనే సర్కారు కొనుగోళ్లు చేపట్టాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. పత్తిని కొనాల్సిన మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ) క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయలేదు. మరోవైపు ఇప్పటికే పలు జిల్లాల్లో పత్తి పంట చేతికి వస్తున్నది. పంటను అమ్ముకోవడానికి రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ఇంకా సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను కూడా సిద్ధం చేయలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రైవేట్ వ్యాపారులకు రైతులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర కింద క్వింటాల్‌‌కు రూ.7,020 కేటాయించింది. గతేడాది క్వింటాల్ రూ.6,380 ఉండగా.. ఈ ఏడాది రూ.600 దాకా పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో వానాకాలం పత్తిసాగు గణనీయంగా పడిపోయింది. ఈ సీజన్ లో 45 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రారంభంలో పంట నష్టం జరగడంతో దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో మద్దతు ధర పెరిగినా.. దిగుబడి పెద్దగా రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు.