- కల్చరల్, ట్రైబల్ వర్సిటీల ఏర్పాటు కలేనా?
- మేనిఫెస్టోలో పెట్టి మరిచిన టీఆర్ఎస్ సర్కార్
- ఉన్న వర్సిటీలకు నిధులివ్వట్లే..
- 5 ప్రైవేట్ వర్సిటీలకు మాత్రం అనుమతులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా పనిచేసిన సర్కారు యూనివర్సిటీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. నిధుల్లేక, నియామకాలు జరగక అవి అవస్థలు పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విద్యా రంగం వివక్షకు గురైందన్న నేతలే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. కొత్త వర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిన పాలకులు.. ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో మాత్రం ఆ మాట నిలుపుకొన్నారు. కానీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సర్కారు మహిళా వర్సిటీతో పాటు పలు వర్సిటీల ఏర్పాటుపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మహిళా వర్సిటీ మాటే మరిచిన్రు..
తాము అధికారం చేపడితే విద్యారంగంలో కీలక మార్పులు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే టీఆర్ఎస్ పేర్కొంది. ప్రధానంగా మహిళా వర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి తోడు మైనింగ్, ట్రైబల్, కల్చరల్ యూనివర్సిటీలనూ పెడతామని హామీలిచ్చింది. మహిళా వర్సిటీ ఏర్పాటుపై కాస్త హడావుడి చేసిన సర్కారు మళ్లీ వెనక్కి తగ్గింది. కోఠి మహిళా కాలేజీలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసినా, ప్రైవేటు వర్సిటీల్లో ఒకటి మహిళా వర్సిటీ వస్తుందని దీన్ని పక్కనపెట్టారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మహిళ ఉన్నా.. మహిళా వర్సిటీ ఏర్పాటుపై అడుగులు పడటం లేదనే విమర్శలున్నాయి.
వర్సిటీల్లో కొలువుల భర్తీ ఎప్పుడో..?
రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 11 యూనివర్సిటీలున్నాయి. ఏండ్ల నుంచి ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను పది వర్సిటీల్లో ఇటీవలే భర్తీ చేశారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ చాన్స్‌లర్, వైస్ చాన్స్‌లర్ లేకుండానే ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ఐటీ) కొనసాగుతోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వర్సిటీలు ప్రస్తుతం నిధుల్లేక వెలవెలపోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీల్లోని ఖాళీలనూ భర్తీ చేయలేదు. ప్రస్తుతం 11 యూనివర్సిటీల్లో మొత్తం 2,837 సాంక్షన్ పోస్టులుండగా, వాటిలో 968 మంది టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. టీచింగ్ఫ్యాకల్టీ రెగ్యులర్వాళ్లు లేకపోవడంతో యూనివర్సిటీల ర్యాంకు పడిపోతున్నాయి. జీతాలకు సరిపడా నిధులు మాత్రమే బడ్జెట్లో పెడుతున్నారు. దీంతో వర్సిటీలు కాలేజీల దగ్గర అప్పులు తీసుకుని మరీ సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఏమైనా పనులు చేయాలంటే, కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారు. ఏండ్ల నుంచి నిధుల్లేక రీసెర్చ్ లన్నీ మూలనపడ్డాయి.
ప్రైవేటు వర్సిటీలకు రెడ్‌కార్పెట్
రాష్ట్రంలో సర్కారు వర్సిటీలను పట్టించుకోని ప్రభుత్వం, ప్రైవేటు వర్సిటీలకు మాత్రం ఫుల్ ప్రయార్టీ ఇచ్చింది. 2020–21లో మహీంద్రా, వాక్సన్, మల్లారెడ్డి, ఎస్ఆర్, అనురాగ్ ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్లకు సర్కారు అనుమతినిచ్చింది. వీటిలో మూడు టీఆర్ఎస్ నేతలవే. మల్లారెడ్డి యూనివర్సిటీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినది కాగా, అనురాగ్ వర్సిటీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిది, ఎస్ఆర్ యూనివర్సిటీ టీఆర్ఎస్ నేత వరదారెడ్డిది. ఈ వర్సిటీల ఏర్పాటు కోసం అనేక నిబంధనలు మార్చారు. రిజర్వేషన్లు ఎత్తేయగా, స్టూడెంట్ గానీ, వారి పేరెంట్స్ గానీ ఇక్కడ రెండేండ్లు ఉంటే వారిని లోకల్‌గానే భావిస్తామని సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో ఏడు ప్రైవేటు వర్సిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే, సర్కారు వర్సిటీలు క్రమంగా మూతపడే చాన్స్ ఉంది.
