రైతుబంధు రూ.7వేల కోట్లు ఎటుపోయినయ్​? : ఏలేటి మహేశ్వర్​రెడ్డి

రైతుబంధు రూ.7వేల కోట్లు ఎటుపోయినయ్​? :  ఏలేటి మహేశ్వర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కోసం కేటాయించిన రూ. 7 వేల కోట్లు ఎటుపోయాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్  సర్కారు  రైతుబంధు కోసం ఆ సొమ్మును కేటాయించి రైతుల అకౌంట్లలో జమ చేస్తుండగా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు సొమ్మును దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ ఎన్వీ సుభాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుకాటకాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుండటంతో రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ‘‘అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేయలేదు. కాంగ్రెస్ సర్కారు రైతులకు రుణమాఫీ ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలో ఉంది” అని ఆయన ఆరోపించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం 13 వారాల్లో రూ. 13 వేల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చింది. బాండ్లను ఓపెన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మి మరో రూ. 4 వేల కోట్ల రుణాన్ని తెచ్చింది.  రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఈ సర్కార్​ పూర్తిగా మోసం చేసింది” అని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయని, చాలా చోట్ల పంట పొట్టకొచ్చిన దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు