
- యువ కార్మికులు ఎటువైపు?
- గుర్తింపు ఎన్నికల్లో వారి ప్రభావం
- ప్రసన్నం చేసుకునేందుకు యూనియన్ లీడర్ల యత్నం
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణిలో సుమారు 40 వేల మంది కార్మికులు ఉండగా, వారిలో కొత్తగా చేరిన యువ కార్మికుల సంఖ్య 20 వేల దాకా ఉంది. ఈనెల 27న జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో యువ కార్మికులు ఎవరి వైపు మొగ్గుచూపితే వారినే విజయం వరిస్తుంది. దీంతో యువ కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా కార్మిక సంఘాలు పావులు కదుపుతున్నాయి. సీనియర్ కార్మికులతో పోలిస్తే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి యూనియన్ లీడర్లతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి వివరాలు సేకరించే పనిలో యూనియన్ లీడర్లు తలమునకలయ్యారు. సింగరేణిలో ప్రస్తుతం యువ ఉద్యోగులు బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్నారు.దీంతో ఆయా కుటుంబ వివరాలను కార్మిక సంఘాలు సేకరిస్తున్నాయి. ఏ కార్మికుని వారసుడిగా ఉద్యోగంలో చేరారు, ఆ కార్మికుడు పనిచేసిన సమయంలో ఏ సంఘానికి అనుకూలంగా ఉన్నాడు వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఆ కార్మికుడి వారుసడిని కూడా అదే సంఘానికి మద్దతుగా పనిచేయించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్తూ యువ కార్మికుడితో పాటు అతని తోటి కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు.
కొత్తగా 16 వేల మంది చేరిక
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విధానం ప్రారంభమైన 1998 సంవత్సరానికి ముందు సుమారు 1.16 లక్షల కార్మికులు సింగరేణిలో కొనసాగారు. ఆ సమయంలో వారసత్వ ఉద్యోగాల కొనసాగింపుతో యువ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాలక్రమేణా ఆ ఉద్యోగాలు రద్దయ్యాయి. దీంతో 2014 నుంచి సింగరేణిలో కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగాలు ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉద్యోగం చేయలేని కార్మికులను అన్ఫిట్ చేసి వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించడం మొదలైంది. ఏటా సుమారు వెయ్యికి పైగా కొత్తవాళ్లను తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు వందకు పైగా మెడికల్ బోర్డులను నిర్వహించారు. సుమారు 16 వేల మంది కొత్తగా చేరారు. వారితో పాటు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా క్లరికల్, ఐటీఐ, డిప్లొమా ద్వారా కొత్తగా 4,200 మందిని నియమించారు. ఫిట్టర్, ఫోర్మెన్, ఎలక్ట్రీషియన్, జేఎంఓ, వెల్డర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో 5,114 మంది కొత్తగా నియమితులైన యువ ఉద్యోగులు ఓటేశారు.
యువ కార్మికులు ఆదరిస్తేనే..
ప్రస్తుతం సింగరేణిలో మొత్తం 39,832 మంది కార్మికులు ఉండగా అందులో కొత్తగా వచ్చిన వారి సంఖ్య 20 వేల వరకు ఉంది. ఏడో దఫా నిర్వహిస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటేయనున్న కార్మికుల్లో సగం మంది యువకులే ఉంటారు. ఇది వరకు ఉన్న సీనియర్ కార్మికులు ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉంటారు. సీనియర్ కార్మికులు వారి వారి సంఘాలకు ఓట్లు వేసుకున్నా తటస్థంగా ఉన్న యువ కార్మికులు ఎటు మళ్లితే ఆ సంఘం విజయం ఖాయంగా భావిస్తున్నారు. దీంతో కార్మిక సంఘాలు యువ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి యూనియన్ల లీడర్లు జోరుగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘాలు యువ కార్మికులతో సమావేశాలునిర్వహించాయి. వారికి తమ యూనియన్ చరిత్రను అవగాహన కలిగించడంతో పాటు సమస్యలు తీరుస్తామని వాగ్దానాలు చేస్తున్నాయి. డిపెండెంట్, కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను తామే తీసుకువచ్చామని ఒక సంఘం, సింగరేణి చరిత్రలో వారసత్వ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తమదేనని మరో సంఘం ప్రచారం చేసుకుంటున్నాయి.