
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ వేములవాడ అభివృద్ధిని బ్రోచర్లలో మాత్రమే చూపెట్టారన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని చెప్పారు. బుధవారం వారు వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఆలయానికి రూ. 150 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు మొదలుకాగా... రూ. 35 కోట్లతో అన్నదాన సత్రం, రూ. 6 కోట్లతో మూడో బ్రిడ్జి, రూ. 76 కోట్లతో ఆలయ అభివృద్ధి, రూ. 9 కోట్లతో మూల వాగు, గుడి చెరువులో మురుగునీరు కలవకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వారి వెంట లీడర్లు చిలుక రమేశ్, గురువయ్య, సాయిని అంజయ్య, కొమురయ్య, రాకేశ్, విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.