సినీ పరిశ్రమను పదేండ్లు పట్టించుకోలే : ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్

సినీ పరిశ్రమను పదేండ్లు పట్టించుకోలే : ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
  •     ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్నరు
  •     హరీశ్ రావుపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
  •     సినీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: సినీ ప‌‌రిశ్రమపై మాజీ మంత్రి హ‌‌రీశ్​రావు చిలుక‌‌ప‌‌లుకులు ప‌‌లుకుతున్నారని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీమియర్ షో  విష‌‌యంలో ఏదో జ‌‌రుగుతుంద‌‌ని హ‌‌రీశ్​రావు అమాయ‌‌కంగా మాట్లాడుతున్నారని, సినిమా ప‌‌రిశ్రమ ప‌‌చ్చగా ఉండ‌‌టం చూడ‌‌లేక పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. ‘‘ప‌‌దేండ్లలో ఏనాడూ చిత్రప‌‌రిశ్రమ‌‌ను ప‌‌ట్టించుకోని బీఆర్ఎస్ నాయ‌‌కులు.. ఇప్పుడు తెగ ప్రేమ చూపిస్తున్నారు.

రాచ‌‌కొండ గుట్టల్లో ఫిలిం సిటీ క‌‌ట్టిస్తామ‌‌ని ప్రగ‌‌ల్భాలు ప‌‌లికి క‌‌నీసం చిన్న రాయి కూడా తీయ‌‌లేదు. పదేండ్ల పాటు సినిమా వాళ్లకు నంది అవార్డులు ఇవ్వకుండా అవమానించిన చ‌‌రిత్ర కేసీఆర్​ది. ఉద్యమ స‌‌మ‌‌యంలో తెలుగు సినిమా న‌‌టులను ఎంత తీవ్రంగా అవ‌‌మానించారో అంద‌‌రికీ తెలుసు. ఇవ‌‌న్ని మ‌‌రిచిపోయి హ‌‌రీశ్​రావు ఇప్పుడు మంగ‌‌ళ‌‌హారతులిస్తున్నారు. 

చ‌‌రిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సినిమా కార్మికుల‌‌తో స‌‌మావేశ‌‌మైన మొద‌‌టి సీఎం రేవంత్ రెడ్డి. వారి సంక్షేమం కోసం అనేక ప‌‌థ‌‌కాలు ప్రకటించారు. పదేండ్లలో ఎన్నో ప్రీమియర్ షోలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హీరోలు, నిర్మాతల ప్రయోజనం కోసమే కేసీఆర్, కేటీఆర్ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు’’అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. 

కార్మికుల సంక్షేమమే ముఖ్యం

తమ ప్రభుత్వం నటులు, నిర్మాతలను కాపాడుకుంటూనే కార్మికుల సంక్షేమ గురించి ఆలోచిస్తున్నదని ఆది శ్రీనివాస్​ తెలిపారు. ‘‘మా ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు ఈ షోల ద్వారా వచ్చే డబ్బులో 20శాతం సినిమా కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లేలా జీవో ఇచ్చింది. సినిమా కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేస్తున్నాం. వారిపిల్లల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ల జీతభత్యాలు పెంచడానికి నిర్మాతలతో చర్చలు జరిపాం. బీఆర్ఎస్ లీడర్లకు సినిమా వాళ్ల గెస్ట్ హౌస్​లు, ఫిలిం ఫంక్షన్లు మాత్రమే తెలుసు. మా సీఎంకు సినిమా కార్మికుల కష్టాలు తెలుసు. 

ప్రీమియర్ షోలకు అనుమతి విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటున్నది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా సీఎంకు తెలుసు. సినీ కార్మికుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తున్నది. గద్దర్ పేరుతో సినిమా అవార్డులను మా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫోర్త్ సిటీలో ఫిలిం సిటీ ఏర్పాటు చేయబోతున్నాం’’అని పేర్కొన్నారు.