సీఎం టూర్‌‌‌‌పైనా రాజకీయాలా?..బీజేపీ నేతలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

సీఎం టూర్‌‌‌‌పైనా రాజకీయాలా?..బీజేపీ నేతలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
  • సీఎం రేవంత్‌‌‌‌కు అరవింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపైనా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్​అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సీఎం భారత వ్యతిరేక శక్తులను కలిసేందుకు లండన్ వెళ్లారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే సీఎం రేవంత్‌‌‌‌కు అరవింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం లండన్ టూర్‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.

ఈ విషయం అరవింద్‌‌‌‌కు తెలియదా అని ప్రశ్నించారు. లండన్‌‌‌‌లోని యూనివర్సిటీలు, క్రీడా సంస్థలను సీఎం సందర్శించడాన్ని కూడా బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. లండన్ యూనివర్సిటీల్లో విద్యా విధానాలను పరిశీలించి.. వాటిలో మంచి విధానాలను తెలంగాణలో అమలు చేయాలని సీఎం చూస్తున్నారని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం సీఎం పర్యటన చేస్తే బీజేపీ నేతలకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు.