
- ..ఆ పార్టీలో మిగిలేది నలుగురే
వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని స్కాములే జరిగాయని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 144 మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకున్న వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. బీఆర్‌ఎస్‌లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు.
రూ.వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కొద్దినెలల్లోనే కూలిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. కరెంట్ కొనుగోళ్లలో, ఫోన్ ట్యాపింగ్, ఇ–కారు రేసింగ్, గొర్ల పంపిణీ పథకం.. ఇలా అన్నింటిలోనూ స్కాములే జరిగాయన్నారు. కృష్ణజలాల్లో ఏపీ దోపిడీకి నాడు సీఎంగా ఉన్న కేసీఆరే కారణమన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ను రెండు సార్లు ప్రగతి భవన్ పిలుపించుకొని బంగారం పల్లెంలో కృష్ణ జలాలు పెట్టించాడని ఎద్దేవా చేశారు. బనకచర్ల పాపం
బీఆర్‌ఎస్‌దేనన్నారు.
ఆన్‌లైన్ క్లాస్‌లను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడలో మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ స్కూల్, కాలేజీలో అన్‌అకాడమీ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఆన్‌లైన్ డిజిటల్ క్లాస్‌లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఐఐటీ ఫౌండేషన్, నీట్ వంటి క్లాస్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజ, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ప్రిన్సిపాల్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు