వైట్ కాలర్ టెర్రరిజం పెరిగిపోతున్నది.. ఉన్నత చదువు చదివిన వారూ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు

వైట్ కాలర్ టెర్రరిజం పెరిగిపోతున్నది..    ఉన్నత చదువు చదివిన వారూ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు
  •     రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆందోళన
  •     ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్  ఘటనే 
  •     ఇందుకు నిదర్శనమని వెల్లడి
  •     నైతిక విలువలతో కూడిన విద్య అందించాలని సూచన

ఉదయ్​పూర్: దేశంలో వైట్ కాలర్  టెర్రరిజం పెరిగిపోతున్నదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్  సింగ్  ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువు చదివినోళ్లే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఢిల్లీ బాంబ్  బ్లాస్ట్  ఘటనే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 

రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో శుక్రవారం భూపాల్  నోబుల్స్  యూనివర్సిటీ 104వ ఫౌండేషన్  డే కార్యక్రమంలో రాజ్ నాథ్  పాల్గొని మాట్లాడారు. ఇటీవలే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడికి పాల్పడిన వారు డాక్టర్లని తెలిసి తాను దిగ్ర్భాంతి చెందానని చెప్పారు. ఇలాంటి వైట్ కాలర్  టెర్రరిజం (ఉన్నత చదువులు చదివి టెర్రరిజం, సైబర్  మోసాలు వంటి నేరాలకు పాల్పడడం) దేశంలో ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతోందని పేర్కొన్నారు. 

‘‘మందులు  తీసుకోవాలంటూ ప్రిస్క్రిప్షన్ పై ఆర్ఎక్స్  అని రాసేవారే ఆర్డీఎక్స్  పట్టుకొని తిరుగుతున్నారు. ఉన్నత చదువులు చదివినంతమాత్రాన సరిపోదని ఇలాంటి ధోరణి తెలియజేస్తున్నది. నాలెడ్జ్  ఒక్కటే సంపాదిస్తే చాలదు.. నైతిక విలువలు కూడా అలవరచుకోవాలి. నైతిక విలువలు, క్యారెక్టర్ ను నిర్మించే విద్య ఇప్పుడు మనకు అవసరం” అని రాజ్ నాథ్  వ్యాఖ్యానించారు.

ప్రార్థనా మందిరాలకు వెళ్లడం ఒక్కటే మతం కాదు

మతం, నైతికతలేని విద్యతో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని రాజ్ నాథ్  అన్నారు. ‘‘నేను మతం గురించి మాట్లాడితే.. గుడికి వెళ్లడమో, లేక చర్చి లేదా మసీదుకు వెళ్లడమో కాదు. ప్రార్థనా మందిరాలకు వెళ్లడంతో మతాన్ని ముడిపెట్టరాదు. మతం అనేది ఒకరు తమ దేశం, సమాజానికి నిర్వర్తించాల్సిన విధి గురించి చెప్పేది. 

నైతిక విలువల గురించి బోధించేది. దురదృష్టవశాత్తు నేటి చదువులు ఇలాంటి నైతిక విలువలను బోధించడం లేదు. అందుకే చదువుకున్న వారు కూడా నేరాలకు పాల్పడుతున్నారు” అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. 

ఇక రక్షణ రంగంలో చాలా స్టార్టప్ లు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో రక్షణ రంగంలో మన దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.