
హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదీ తేలిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులెవరనేది ఇంకా తేలలేదు. ఐదు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీజేపీ టికెట్ ను మగ్గురు ఆశిస్తున్నారు. వారిలో ప్రకాశ్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానమైనప్పటికీ ఇంతవరకు క్యాండిడేట్ ఎవరనేది ఫైనల్ చేయలేదు. బీజేపీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
4.61 లక్షల మంది ఓటర్లు
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4 లక్షల 61 వేల మంది ఓటర్లున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యగా ఎన్నికవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మే 2న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ తెలిపింది. అదే రోజు నామినేషన్ల పర్వం మొదలవుతుంది. మే 9వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 13న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5న కౌంటింగ్ చేసి విజేతను తేల్చనున్నారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన మరుసటి రోజే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
జర్నలిస్టు టు లీడర్
యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన మల్లన్న ఉస్మానియా వర్సిటీ పూర్వ విద్యార్థి. జర్నలిజంలో మాస్టర్స్ చేసిన మల్లన్న.. వీ6 చానల్ రిపోర్టర్ గా ప్రస్థానం ప్రారంభించి.. విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత క్యూ న్యూస్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైలుకు పంపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్నకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ను కేటాయించింది.