జెనీవా: మన దేశంలో ప్రస్తుత కరోనా విస్ఫోటానికి బీ.1.617 రకం వైరసే కారణం కావచ్చని డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. శనివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. గత అక్టోబర్ నెలలో గుర్తించిన బీ.1.617 రకం కరోనా వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తోందని, దేశంలో కేసులు, డెత్స్ భారీగా పెరిగేందుకు ఇదే ప్రధాన కారణం కావచ్చని ఆమె చెప్పారు. ఇది టీకాలకు కూడా లొంగనంత మొండిగా తయారై ఉంటుందన్నారు.
మరిన్ని వేరియెంట్లు రావొచ్చు
వైరస్ ఎక్కువ కాలం వ్యాపిస్తూ పోతే.. అనేక మ్యుటేషన్లు జరిగి కొత్త కొత్త వేరియెంట్లు కూడా పుట్టుకొస్తాయని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఎక్కువగా మ్యుటేషన్లు జరిగిన వైరస్ లకు ప్రస్తుత వ్యాక్సిన్ లు పని చేయకపోవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టీకాలు తీసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల నుంచి కూడా అవి తప్పించుకునే చాన్స్ ఉంటుందన్నారు. అదే జరిగితే ప్రపంచానికి భారీ ముప్పు తప్పకపోవచ్చన్నారు.
టీకాలతోపాటు రూల్స్ పాటిస్తేనే..
130 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటివరకూ 2% మందికే వ్యాక్సినేషన్ జరిగిందని, 70 నుంచి 80% మందికిటీకాలు వేయాలంటే మరికొన్ని నెలలు పడుతుందని సౌమ్య అభిప్రాయపడ్డారు. అయితే కేవలం వ్యాక్సిన్ లతోనే పరిస్థితి కంట్రోల్ లోకి రాదని, ప్రజలంతా రూల్స్ పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని
అడ్డుకోవచ్చన్నారు.
నిర్లక్ష్యం వల్లే..
ఇండియాలో కరోనా ఉధృతికి కొత్త వేరియెంట్లు మాత్రమే కాకుండా, ప్రజలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా కారణమని సౌమ్యా స్వామినాథన్ అన్నారు. మొదట్లో కరోనాపై పోరాటంలో విజయం సాధించినట్లు భావించడంతో ప్రజలు నిర్లక్ష్యంగా మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ వంటివి పట్టించుకోలేదన్నారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు, సమావేశాలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి పెరిగిందన్నారు.
