ఫోన్ ఎక్కువగా మాట్లాడితే.. బ్రెయిన్ క్యాన్సర్‪ వస్తుందా?

ఫోన్ ఎక్కువగా మాట్లాడితే.. బ్రెయిన్ క్యాన్సర్‪ వస్తుందా?
  •     మొబైల్​తో క్యాన్సర్ వస్తుందనేందుకు ఆధారాల్లేవ్: డబ్ల్యూహెచ్ఓ
  •     63 స్టడీలను విశ్లేషించి నిపుణుల నివేదిక 
  •     దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని సిఫారసు 

జెనీవా : మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడితే మనుషులకు బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా బ్రెయిన్  క్యాన్సర్​కు దారి తీసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1994 నుంచి 2022 మధ్య జరిగిన 63 స్టడీలను డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలోని 10 దేశాలకు చెందిన 11 మంది రేడియేషన్, క్యాన్సర్, ఇతర రంగాల నిపుణులు విశ్లేషించి ఈమేరకు నివేదిక సమర్పించారు. ‘ఎన్విరాన్ మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్​ దీనిని పబ్లిష్ చేసింది. 

రోజూ ఎక్కువ సమయం ఫోన్లు వాడేవారితో పాటు ఒక దశాబ్దం నుంచి ఫోన్లు వాడుతున్న వారికి కూడా బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరిగినట్టు దాఖలాలు లేవని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, రాడార్లు, ఇతర డివైస్ ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ స్థాయిలు డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన సేఫ్టీ లెవల్స్ కంటే తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని వీరు తెలిపారు. 

ఇంత తక్కువ స్థాయి రేడియేషన్ వల్ల ఎక్కడా క్యాన్సర్ ముప్పు పెరిగినట్టుగానీ, మనుషుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపినట్టుగానీ దాఖలాలు లేవన్నారు. అయితే, మొబైల్ ఫోన్ల రేడియేషన్​తో మనుషుల ఆరోగ్యానికి ముప్పు అంశంపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు సిఫారసు చేశారు.

ఐఏఆర్సీ ప్రకారం.. క్యాన్సర్ కారకమే! 

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) ప్రస్తుతం మొబైల్ ఫోన్ రేడియేషన్ ను ‘క్లాస్ 2బీ’ జాబితాలో చేర్చింది. అంటే.. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని దాని అర్థమని కొందరు ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. అయితే, దీనిపై ఐఏఆర్సీ చివరిసారిగా 2011లో అసెస్మెంట్ చేసిందని, ఆ తర్వాత జరిగిన అనేక స్టడీలను పరిశీలించి ఈ అంశాన్ని రీఅసెస్మెంట్ చేసి, జాబితాను రీక్లాసిఫై చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.