బొద్దింక జనతా పార్టీ వెనకున్న ఈ అభిజీత్ దీప్కే ఎవరు..? టార్గెట్ ఏంటి..?

బొద్దింక జనతా పార్టీ వెనకున్న ఈ అభిజీత్ దీప్కే ఎవరు..? టార్గెట్ ఏంటి..?

ఇండియాలో రాజకీయం అంటే చాలా ఖరీదైన వ్యవస్థ. బోలెడంత డబ్బు ఖర్చుపెట్టాలి. అయినా గెలుస్తారని గ్యారెంటీ లేదు. కానీ.. రాత్రికి రాత్రే ఒక పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది.

ఉద్యోగం దొరకని లేదా వృత్తిలో రాణించలేకపోతున్న కొందరు యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారని, వారిలో కొందరు మీడియా, మరికొందరు సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి ప్రతి ఒక్కరిపై విమర్శలు చేస్తున్నారని సీజేఐ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్య థోరణిలో స్పందిస్తూ పెట్టిన ఈ Gen Z పార్టీ పేరు CJP.

అంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP). మన తెలుగులో చెప్పాలంటే.. బొద్దింక జనతా పార్టీ. ఈ పార్టీ గురించి రెండు, మూడు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ పార్టీ పేరుతో క్రియేట్ చేసిన ఇన్ స్టాగ్రాం అకౌంట్ను 4 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారంటే.. ఈ బొద్దింక జనతా పార్టీ దేశంలో.. మరీ ముఖ్యంగా దేశ యువతలో ఎంత హాట్ టాపిక్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ.. CJP ఇన్ స్టా అకౌంట్ ను ఫాలో అవుతున్న వాళ్లలో నూటికి 90 శాతం Gen Zలే కావడం విశేషం.

ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇండియాలో Gen Z ఉద్యమాలు రావడం ఖాయమని ఈ పార్టీ చెప్పకనే చెప్పింది. ఈ డిజిటల్ తుఫానుకు కేంద్ర బిందువు 30 ఏళ్ల రాజకీయ ప్రచార వ్యూహకర్త అయిన అభిజీత్ దీప్కే. ఆయన ఆన్‌లైన్లో చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. Gen Z ఉద్యమాలకు స్పూర్తినిచ్చింది.

యువత రాజకీయాలపై ఉద్యమాలు, విప్లవాలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తేల్చేసింది. ఈ పార్టీ సరదా కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మొదలుపెట్టింది. పదివేల సంఖ్యలో సభ్యులను కూడా చేర్చుకుంది. అంతేకాదు.. మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఈ సభ్యత్వం తీసుకోవడం విశేషం. దీప్కే సృష్టించిన ఈ CJP.. మన దేశ యువత అనుభవిస్తున్న నిరుద్యోగ కష్టాలను, చేవచచ్చిన రాజకీయ వ్యవస్థను.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావనను వ్యక్తపరిచింది.

CJP సృష్టికర్త.. ఈ అభిజీత్ దీప్కే ఎవరంటే..

ఈ CJPని తెరపైకి తెచ్చిన అభిజీత్ దీప్కే ఎవరంటే.. పూణేలో జర్నలిజంలో పట్టభద్రుడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి, బోస్టన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పెరుగుతున్న డిజిటల్ యుగంలో సమాచార ప్రసారం రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. అమెరికాకు వెళ్ళే ముందు, అతను 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్‌గా పనిచేశాడు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్కు అనుకూలంగా.. ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ క్యాంపెయిన్ చేశాడు. 2023లో.. దీప్కే తన గ్రాడ్యుయేట్ స్కూల్ దరఖాస్తులను సిద్ధం చేసుకుంటూ.. మన దేశంలోని రాజకీయ వ్యవస్థను ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఔరంగాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ బొద్దింక జనతా పార్టీ.

బొద్దింక జనతా పార్టీ గురించి చెప్పాలంటే.. CJP తనను తాను “సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుకగా పరిచయం చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే సూటిగా, రెచ్చగొట్టే విధంగా ఉన్న దాని మేనిఫెస్టోలో ఐదు వాగ్దానాలు ఉన్నాయి..

* ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు ఉండవు
* చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే UAPA కింద ఎన్నికల అధికారులను అరెస్టు చేయడం
* మహిళలకు 50 శాతం రిజర్వేషన్
* ప్రధాన వ్యాపార సంస్థల యాజమాన్యాలకు చెందిన మీడియా లైసెన్సులను రద్దు చేయడం
* పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడం

ఇవీ.. CJP చేసిన ఐదు వాగ్దానాలు. ఈ పార్టీ ఇంకా నమోదు కానప్పటికీ.. దేశ యువత నుంచి ఈ పార్టీ అతి తక్కువ సమయంలోనే మద్దతు కూడగట్టుకుంది. యువతలోని Gen Zలకు ఈ పార్టీ చేరువవుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ పార్టీకి వస్తున్న స్పందన చెప్పకనే చెప్పింది. 

గూగుల్ ఫారం ద్వారా 3 లక్షల 50 వేల మందికి పైగా యువత అధికారికంగా CJP సభ్యత్వం కోసం నమోదు చేసుకోవడం విశేషం. రేపోమాపో.. Gen Zలకు ఇదో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.