బీసీ సీఎం ఎవరు?.. అమిత్ షా ప్రకటనతో బీజేపీలో చర్చ

బీసీ సీఎం ఎవరు?.. అమిత్ షా ప్రకటనతో బీజేపీలో చర్చ
  • ప్రచారంలో లక్ష్మణ్, సంజయ్, రాజాసింగ్, విజయశాంతి, ఈటల, అర్వింద్ పేర్లు
  • లక్ష్మణ్, సంజయ్, రాజాసింగ్ కు సంఘ్ నేపథ్యం
  •  అర్వింద్, ఈటల విజయాలతో రాష్ట్రంలో బీజేపీకి ఊపు

హైదరాబాద్, వెలుగు: బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని అమిత్ షా ప్రకటించడంతో.. ఆ అభ్యర్థి ఎవరు? అనే చర్చ పార్టీలో మొదలైంది. ఇప్పుడు అందరి చూపు బీజేపీలోని బీసీ నేతలపై పడింది. వీరిలో ప్రధానంగా ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.. మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడీ ఆరుగురు నేతల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  

ముగ్గురికి సంఘ్ నేపథ్యం..  

లక్ష్మణ్, సంజయ్, రాజాసింగ్ కు సంఘ్ నేపథ్యం ఉంది. స్టేట్ బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న లక్ష్మణ్.. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ శాసనసభా పక్ష నేతగా పని చేశారు. ఏబీవీపీలో విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టిన సంజయ్.. ఆ తర్వాత బీజేవైఎంలో పని చేసి, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కార్పొరేటర్ నుంచి ఎంపీ అయి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక రాజాసింగ్.. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఏడాదిన్నర కింద ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన హైకమాండ్.. ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసి, గోషామహల్ టికెట్ కేటాయించింది. గతంలో రాజాసింగ్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు.  శ్రీరాం యువసేన పేరుతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, విజయశాంతి..  బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ సీటు నుంచి సీఎం కేసీఆర్ బిడ్డ కవితను ఓడించి అర్వింద్ సంచలనం సృష్టించారు. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు తీసుకురావడంలో అర్వింద్ గెలుపు ఎంతో దోహదపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపుతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే టాక్ వచ్చింది. ఇక బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ శిష్యురాలిగా విజయశాంతి గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. మధ్యలో కాంగ్రెస్ లోకి  వెళ్లినా, మళ్లీ తిరిగి బీజేపీలోకి వచ్చారు.

బీసీ నినాదం కలిసొచ్చేనా?

బీజేపీ ఈసారి బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నది. వ్యూహాత్మకంగానే బీసీని సీఎం చేస్తామని ప్రకటించినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీలను కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నాయని బీజేపీ మొదటి నుంచి విమర్శిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు బీసీని సీఎంగా చేస్తామని చెప్పడం ద్వారా బీసీ వర్గానికి బీజేపీ చేరువయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.