కవిత వెనుక ఎవరు? కాంగ్రెస్ లీడర్లే ఎందుకు ఖండిస్తుండ్రు?

కవిత వెనుక ఎవరు?  కాంగ్రెస్ లీడర్లే ఎందుకు ఖండిస్తుండ్రు?
  • బీఆర్ఎస్ పార్టీ కవితను సపోర్ట్ చేస్తలె!
  • మల్లన్న టార్గెట్ గా హస్తం లీడర్ల వ్యాఖ్యలు
  • బీసీ వాయిస్ దారి తప్పుతోందా?

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో విభేదిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసుపై ఆమె  సంస్థ జాగృతికి చెందిన కార్యకర్తలు దాడి చేయడం సంచలనం రేపింది. కవిత బీసీ కాదు.. ఆమెకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏమిటని పేర్కొంటూ తెలంగాణ సామెతను ఉదహరించారు. ‘మీతో మాకు కంచం పొత్తుందా?.. మంచం పొత్తుందా..?’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆదివారం ఉదయం జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడికి దిగారు. 

అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ క్యూన్యూస్ కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. అక్కడున్న గన్ మన్లను తోసేశారు. దీంతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నకు జాగృతి సంస్థకు చెందిన ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం  ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. అటు జాగృతి కార్యకర్తల దాడినీ ఖండించారు. అయితే ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. గతంతో కాంగ్రెస్ బీఫారం మీద విజయం సాధించిన తీన్మార్ మల్లన్న బీసీల లెక్కలు తప్పుగా ఉన్నాయని పేర్కొంటూ సర్వే నివేదికనలు కాల్చి వేశారు. ఈ ఘటన కాంగ్రెస్ నాయకత్వానికి కోపం తెప్పించింది. వెంటనే మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి తాను కట్టుబడే ఉన్నానంటూ మల్లన్న చెప్పడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత బీసీ నాయకత్వాన్ని ఏకం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. 

ఫూలే ఫ్రంట్ పేరుతో కవిత ఎంట్రీ

భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదే క్రమంలో బీసీ వాదంతో తెరపైకి వచ్చారు. ఫూలే ఫ్రంట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 17న రైల్ రోకో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అన్ని పార్టీ ల మద్దతుకోరారు. ఆమె రైల్ రోకోకు రెండు రోజుల ముందు ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు గంట ముందు గా అసెంబ్లీని, మండలిని ప్రోరోగ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేయించారు. ఆ వెంటనే కేబినెట్ లో ఆర్డినెన్స్  ప్రవేశపెట్టారు. 

కేబినెట్ వివరాలు మంత్రి పొంగులేటి వెల్లడిస్తున్న సమయంలోనే బంజారాహిల్స్ లోని కవిత నివాసం వద్ద వందల మంది కార్యకర్తలు గుమిగూడి సంబురాలు చేసుకున్నారు. ఇది భారత జాగృతి సాధించిన విజయమంటూ పటాకులు కాల్చారు.  నీలిరంగు పుసుకోని డ్యాన్సులు చేశారు. ఆ రాత్రే బైక్ ర్యాలీకి కూడా ప్లాన్ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ రాత్రి పూట కవిత ఇంటి వద్ద భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు ఎలా జమయ్యారు..? ఆమెకు బీసీ ఆర్డినెన్స్ గురించిన సమాచారం ముందే ఉందా..? వాళ్లందరినీ ముందుగా గ్యాదర్ చేశారా..? ఎవరు ఆమెకు కేబినెట్ మీటింగ్ సమాచారం ఇచ్చి ఉంటారు..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. 

ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు..!

కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతల నుంచి పెద్దగా స్పందన రాలేదు.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, మాజీ మంత్రి హరీశ్ రావు గానీ స్పందించలేదు. గురుకులాల్లో పిల్లలు అస్వస్థతకు గురైతే ట్వీట్లు చేసే ఈ నేతలిద్దరూ సైలెంట్ అయిపోయారు. చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వచ్చి నందినగర్ నివాసంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, కవిత తండ్రి కేసీఆర్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. 

పార్టీ సైలెంట్ గా ఉండటంపై విమర్శలు రావడంతో హుటాహుటిన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కవిత మాత్రం  తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని పదే పదే చెబుతున్నా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖండిస్తున్నామని ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రకటించకపోవడం, ఆ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ కు, డీజీపికి ఆమె వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే వెంట వెళ్లకపోవడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్ లోని బీసీ నాయకులు మాత్రం కవితను అన్న మాట పానాలు పోయే మాట అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.