బీజేపీ చీఫ్ ఎవరు? లిస్టులో ఆ ముగ్గురు..

బీజేపీ చీఫ్ ఎవరు? లిస్టులో ఆ ముగ్గురు..

కేంద్ర కేబినెట్​లోకి అమిత్​ షాను తీసుకుంటే.. మరి ఆయన నిర్వహిస్తున్న బీజేపీ చీఫ్​ పోస్టు ఎవరికి? ఇప్పుడు కమలనాథుల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనుండటం, ఆయనతోపాటు కొందరు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనుండటంతో ఎవరికి బీజేపీ చీఫ్​ పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చడంలో మోడీ, అమిత్​ షా జోడీ సక్సెస్​ అయింది. దీంతో అమిత్​ షాకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని, కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల్లో ఏదో ఒక శాఖ ఆయనకు లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్​లోకి షా వెళ్తే బీజేపీ చీఫ్​ పోస్టు ఖాళీ అవుతుంది. ఆ పోస్టుకు ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అందులో మొన్నటి మోడీ కేబినెట్​లో మంత్రులుగా పనిచేసిన జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్​తో పాటు రాజ్యసభ్యుడు భూపేంద్ర యాదవ్​ ఉన్నారు. వీరు అమిత్​ షాకు అత్యంత సన్నిహితులు. 2014 ఎన్నికల్లో బీజేపీ చీఫ్​గా ఉన్న రాజ్​నాథ్​ సింగ్​ నాడు పార్టీ అధికారంలోకి రావడంతో కేంద్ర కేబినెట్​లో చేరారు. దీంతో బీజేపీ చీఫ్​గా షా నియమితులయ్యారు. షా బాధ్యతలు చేపట్టాక దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. లోక్​సభ ఎన్నికల్లోనూ షా వ్యూహం ఫలించింది. ‘అబ్​కీ బార్​ 300 ప్లస్​’ నినాదంతో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 6వ దశ పోలింగ్​ ముగిసిన వెంటనే.. తమకు 300కు పైగా సీట్లు వస్తాయని షా లెక్కలు వేశారు. రిజల్ట్స్​లో అది రుజువైంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ.. ఎప్పటికప్పుడూ వ్యూహాలు మారుస్తూ.. పార్టీకి మంచి ఫలితాలను అందిస్తున్న అమిత్​ షా కేంద్ర కేబినెట్​లోకి వెళ్తే ఆ స్థాయిలో వ్యూహాలు రచించే నాయకులు బీజేపీలో లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి.

యూపీలో బీజేపీ గెలుపు నడ్డాకు ప్లస్​

జేపీ నడ్డా మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్​కు పార్టీ ఇన్​చార్జ్​గా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్​ఎల్​డీ కూటమిగా ఏర్పడటంతో బీజేపీకి భారీ స్థాయిలో సీట్లు తగ్గిపోతాయని ప్రీపోల్​ సర్వేలు అంచనా వేశాయి. నడ్డా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లారు. అది ఫలించి  యూపీలో బీజేపీ 62 సీట్లు సాధించింది. ఇది నడ్డాకు ప్లస్​ కానుంది. మోడీ ఫస్ట్​ టర్మ్​లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్​ప్రదేశ్​కు చెందిన నడ్డా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా కూడా ఉన్నారు.

ఒడిశాలో వ్యూహం ప్రధాన్​కు ప్లస్​

కేంద్ర పెట్రోలియం మంత్రి పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్​ లోక్​సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేపీ ఇన్​చార్జిగా పనిచేశారు. అక్కడ 2014లో ఒక్క లోక్​సభ సీటుకే పరిమితమైన పార్టీ ఈసారి 8 చోట్ల విజయం సాధించింది. దీని వెనుక ధర్మేంద్ర ప్రత్యేక వ్యూహం అమలు చేశారు. నవీన్​ పట్నాయక్​ నాయకత్వంలోని బీజేడీకి కంచుకోటగా ఉన్న ఒడిశాలో
బీజేపీ 8 సీట్లు గెలువడం ఆశామాషి వ్యవహారం కాదు. ఇదే ప్రధాన్​కు కలిసివచ్చే అవకాశం ఉంది. ఒడిశాకు చెందిన ప్రధాన్​.. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

బీహార్​లో విక్టరీ భూపేంద్రకు ప్లస్​​

రాజస్థాన్​కు చెందిన భూపేంద్ర యాదవ్​ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లోక్​సభ ఎన్నికల్లో బీహార్​లో బీజేపీ ఇన్​చార్జిగా పనిచేశారు. అక్కడ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి..మొత్తం 40 సీట్లలో 39 సీట్లను గెలుచుకుంది. దీని వెనుక భూపేంద్ర కృషి ఉంది.  ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన ఆర్​జేడీకి ఒక్క సీటు కూడా దక్కకుండా పక్కా స్కెచ్​తో ముందుకు వెళ్లారు. గతంలోనూ పలు రాష్ట్రాలకు భూపేంద్ర ఇన్​చార్జిగా వ్యవహరించి మంచి ఫలితాలు రాబట్టగలిగారు.