
హైదరాబాద్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసిందని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మలేరియా, డెంగీ వంటి వైరల్ జ్వరాలు ప్రబలితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలకు నయాపైసాను కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. పల్లెల్లో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతున్నదని చెప్పారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై స్పందించారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ తెలంగాణకు ఇచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు.
ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలి
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హరీశ్ డిమాండ్ చేశారు. ప్రభాకర్ తండ్రి పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేస్తే కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతు చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయకుండా, వీడియో తీసిన వారి మీద కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.