కర్ణాటక సీఎం ఎవరు.. ఆ ముగ్గురిలో ఒకరికే ఛాన్స్..

కర్ణాటక సీఎం ఎవరు.. ఆ ముగ్గురిలో ఒకరికే ఛాన్స్..

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113కు మించి.. అత్యధిక సీట్లలో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థులు. 130 సీట్లలో విజయం ఖాయంగా ఉంది. విక్టరీ వన్ సైడ్ కావటంతో.. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. 

కర్ణాటక సీఎం ఎవరు అని.. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు పోటీలో ఉన్నారు. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య.. మరొకరు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ తీసుకురావటంలో తీవ్రంగా కృషి చేశారు. గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో.. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని నడిపించటంలో.. పార్టీ క్యాడర్ కు ఉత్సాహం నింపటంలో ముందున్నారు. కాంగ్రెస్ నుంచి చేజారిన నేతలను  తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. క్యాంప్ రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న వారిని సైతం ఒప్పించి తీసుకొచ్చారు. ఎన్నికల ఖర్చు కూడా ఆయనే భరించాలనే ప్రచారం ఉంది. మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రను కర్ణాటక రాష్ట్రంలో విజయవంతం చేయటంలో డీకే శివకుమార్ పాత్ర కీలకం.

ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా విస్మరించలేని విషయం. గతంలో ఆయన ఐదేళ్లు సీఎంగా చేసినప్పుడు చేసిన అభివృద్ధి కలిసొచ్చింది. మంచి మాటకారి.. వ్యూహ రచన చేయటంలో దిట్ట. బ్రహ్మాణ – వక్కలింగ – లింగాయత్ సామాజిక వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. గత ఎన్నికల్లోనే కాదు.. ఈ ఎన్నికల్లోనూ ఆయన చేసిన ప్రయోగం ఫలించింది. కొంచెం నోరు దురుసు అనేకానీ.. వ్యక్తిత్వంగా మంచి పేరు ఉంది. కర్ణాటక సీఎం ఎవరు ఉంటే బాగుంటుంది అంటూ చేసిన సర్వేల్లో సిద్దరామయ్యకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 45 శాతానికి పైగా ప్రజలు.. సిద్దరామయ్య సీఎంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. సీఎం నేనే అవుతానంటూ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. తన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని.. చివరి సారిగా సీఎం అయ్యి.. రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు అధిష్టానం ఆయన్ను సీఎం చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఇక కర్ణాటక సీఎం పదవి ఆశిస్తున్న వారిలో మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను పార్టీ అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్. కర్ణాటక రాష్ట్రానికే చెందిన ఆయన.. మోస్ట్ సీనియర్ లీడర్. ఈ ఎన్నికల్లో 20 శాతం ఉన్న దళిత ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పటంలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం ఉంది. ఇక డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం.. ఆయన అభ్యర్థిత్వాన్ని బాగా తెరపైకి తీసుకొచ్చాయి. మల్లిఖార్జున ఖర్గే సీఎం అయితే అభ్యంతరం లేదంటూ ఆయన గతంలో ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అతన్ని సొంత రాష్ట్రానికి పంపిస్తుందా లేదా అనేది చూడాలి...

కర్ణాటక సీఎం ఎవరు అనేది ఈ ముగ్గురిలోనే ఉంది.. ఎవరు అవుతారు.. ఎవర్ని అధిష్టానం నియమిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.