ఆ మహర్జాతకులు ఎవరు.. గ్రేటర్లో ఇద్దరికి చాన్స్

ఆ మహర్జాతకులు ఎవరు.. గ్రేటర్లో ఇద్దరికి చాన్స్
  • 19న కొలువు దీరనున్న కొత్త కేబినెట్‌
  • ఇదివరకే ప్రమాణం చేసిన మహమూద్‌ అలీ
  • మరో ఇద్దరికి లక్కు చిక్కే అవకాశం
  • తలసాని, పద్మారావులలో ఒకరికి పక్కా

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రి వర్గంలో బెర్త్ కోసం ఆశావహుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. మంత్రివర్గం ఏర్పాటు ఎప్పుడెప్పుడా అని రెండు నెలల నుంచి వేచి చూస్తున్న వారి గుండె వేగం పెరిగింది. ఈ నెల19న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే ఇది మినీ కేబినెటా పూర్తిస్థాయిలో కేబినెటా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో కొత్త దాంట్లో మన పేరుంటుందా లేదా అన్న దానిపై రేసులో ఉన్న ఆశావాహులంతా ఆరా తీయటం మొదలుపెట్టారు.

ఇప్పటికే తమకు  అవకాశం ఇవ్వాలంటూ టీఆర్ఎస్ పెద్ద బాస్, చిన్న బాస్ వద్ద ఎవరికి వారు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అంతిమంగా లిస్ట్ లో పేరుంటుందా లేదా అన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కేబినెట్ గ్రేటర్ నుంచి ఏకంగా ఐదుగురు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఈసారి పరిస్థితులు మారాయి. అన్ని జిల్లాల నుంచి మంత్రి వర్గంలో పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ఎప్పుడూ లేని విధంగా అధికారపార్టీ బలం14 కు చేరింది. వీరిలో గతంలో మంత్రులుగా పనిచేసిన తలసాని, పద్మారావు, దానం నాగేందర్ ఉన్నారు.
ఇప్పటికే చోటు దక్కించుకున్న మహమూద్ అలీ గ్రేటర్ కోటాలోనే ఉన్నారు. గత ప్రభుత్వంలో
మంత్రులుగా చేసిన వారంతా మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, శేరిలింగంపల్లి, కుత్బుల్లా పూర్ నియోజకవర్గాల నుంచి గెలిచిన
మాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్, ఆరికెపూడి గాంధీ, కేపీ వివేకానందలు ఈసారి
మంత్రి పదవులపై గంపె డు ఆశలు పెట్టుకున్నారు. మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ రెండుసార్లు గెలువగా కేపీ వివేకానంద మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజేంద్రనగర్ నుంచి ఎన్నికైన ప్రకాష్ గౌడ్ సైతం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఈసారి గ్రేటర్ పరిధిలో మంత్రివర్గం లో చోటు కోసం పోటీపడుతున్న వారి సంఖ్య పది మంది వరకూ ఉంది. కానీ మొత్తం మంత్రి వర్గం కోటాయే 15 మందికి మించకూడదు. దీంతో రేసులో ఉన్న చాలా మంది ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది.

ఇద్దరికి మాత్రం ఖాయం
మినీ కేబినెట్టా లేదంటే పూర్తిస్థాయి కేబినెట్టా అన్నది స్పష్టం గా తేలటం లేదు. ఇప్పటికే మహమూద్ అలీ గ్రేటర్ పరిధిలో ఉన్నప్పటికీ మరో ఇద్దరికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తలసాని, పద్మారావు, దానం నాగేం దర్ లకు సిటిలో మంచి పట్టు ఉంది. పద్మారావు గౌడ్ కు పెద్ద బాస్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. తలసానికి చిన్న బాస్ అండ ఉంది. అలాగే మల్కాజ్ గిరి సిట ్టింగ్ ఎమ్మె ల్యేగా గెలిచి న మల్లారెడ్డి పేరు రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.
దానం నాగేం దర్ కూడా రేసులోఉన్నారు . సీనియర్లలో ఒకరికి, కొత్తవారిలో ఒకరికి చోటు దక్కవచ్చని తెలుస్తుంది. మంత్రి వర్గంలో చోటు కల్పిం చకపోతే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి కానీ, పార్లమెంట్ కార్యదర్శలుగా నియమించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.