మున్నూరుకాపు ఆఫీసర్లపైనే ఏసీబీ దాడులా ?

మున్నూరుకాపు ఆఫీసర్లపైనే ఏసీబీ దాడులా ?
  • ఇరిగేషన్‌‌ ఈఎన్‌‌సీ అనిల్, ఈఈ నూనె శ్రీధర్, హెచ్ఎండీఏ ఆఫీసర్‌‌ బాలకృష్ణపై అక్రమ కేసులు
  • వారు లంచం తీసుకోకున్నా.. కావాలనే వేధిస్తున్నరు
  • బీఆర్ఎస్‌‌ హయాంలోనే మున్నూరుకాపులకు పదవులు
  • ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌ వ్యాఖ్య

కరీంనగర్, వెలుగు : మున్నూరు కాపు కులానికి చెందిన ఆఫీసర్లనే టార్గెట్‌‌గా చేసుకొని ఏసీబీ దాడులు చేస్తోందని కరీంనగర్‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌ ఆరోపించారు. ఇరిగేషన్‌‌ ఈఎన్‌‌సీ అనిల్‌‌కుమార్‌‌, ఈఈ నూనె శ్రీధర్‌‌ సహా పలువురు ఆఫీసర్లు లంచాలు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. కరీంనగర్‌‌లోని భగత్‌‌నగర్‌‌లో శుక్రవారం నిర్వహించిన మున్నూరుకాపు సంఘం జిల్లా సమావేశంలో గంగుల మాట్లాడారు. 

ఈఎన్‌‌సీ అనిల్‌‌కుమార్‌‌ సిన్సియర్‌‌ ఆఫీసర్‌‌ అని.. అయినా అతడిపై కేసు పెట్టారన్నారు. అలాగే హెచ్ఎండీఏలో ఉన్నతాధికారిగా ఉన్న బాలకృష్ణ లంచం తీసుకోకపోయినా... ఏసీబీ దాడులు చేసి కేసులు పెట్టారని ఆరోపించారు. డీటీసీగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్‌‌పై కూడా ఆదాయానికి మించి ఆస్తులున్నాయని దాడి చేశారన్నారు. వేధించేందుకు తమ కులపోళ్లే దొరికారా ? అని ప్రశ్నించారు. కులగణన పేరుతో మున్నూరుకాపు జనాభాను తగ్గించి చూపించారని, ఓటర్‌‌ లిస్ట్‌‌లో తమ కులస్తుల పేర్లు లేకుండా చేసి తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 గతంలో 11 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు ముగ్గురే గెలిచారన్నారు. కాంగ్రెస్‌‌ కేబినెట్‌‌లో మున్నూరు కాపు కులస్తుడికి స్థానం కల్పించాలని డిమాండ్‌‌ చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఆర్టీసీ చైర్మన్‌‌ పదవిని మున్నూరు కాపులకే ఇచ్చారని, ఇప్పుడు కూడా అలాగే చేయాలని కోరారు.