రైతు మరణాలు ఎందుకు  ఎక్కువైతున్నయ్​?

రైతు మరణాలు ఎందుకు  ఎక్కువైతున్నయ్​?
  • రైతుబంధు ఇస్తున్నా ఎందుకిలా?.. రాష్ట్ర ప్రభుత్వం ఆరా
  • కారణాల కోసం త్రీ మెన్ కమిటీ
  • కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • ఈ ఏడు 28,500 రైతు మరణాలు
  • ఇది నిరుడు కంటే 9 వేలు ఎక్కువ
  • వీటిలో నాలుగో వంతు ఆత్మహత్యలే
  • రికార్డులకెక్కని కౌలు రైతుల మరణాలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో రైతుల మరణాలు, ముఖ్యంగా ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతుండటంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ‘‘రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నా ఏటా రైతుల మరణాలు పెరుగుతూనే ఉన్నాయెందుకు? ప్రతి రైతు ఆత్మహత్యనూ స్టడీ చేసి నివేదిక రూపొందించండి” అని వ్యవసాయ అధికారులను సర్కారు ఆదేశించింది. అగ్రికల్చర్‌‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో త్రీ మెన్‌‌ కమిటీ ఏర్పాటు చేయాలని, ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించి కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బీమా డెత్‌‌ రికార్డింగ్‌‌లో మూడు ఆప్షన్లు పెంచడంతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే
2018లో రైతు బీమా ప్రారంభమైన నాటి నుంచి రైతుల మరణాలు ఏటా పెరుగుతున్నాయి. బీమా అమలైన మూడేండ్లలోనే రాష్ట్రంలో 65,696 మంది మృత్యువాత పడ్డారు. 2018‌‌‌‌‑–19లో 17,845, 2019–20లో 19,351 మంది రైతులు మృతి చెందారు.

2020–21లో 28,500 మంది చనిపోయారు.  గతేడాది బీమా పొందిన రైతుల్లో సగటున రోజుకు 78 మంది రైతులు చనిపోతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పైగా వారిలో 95% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పేద రైతులే! మొత్తం మరణాల్లో నాలుగో వంతు ఆత్మహత్యలేనని తెలుస్తోంది. పైగా బీమా పరిధిలోకి రాని 59 ఏండ పైబడ్డ రైతులు, కౌలు రైతుల మరణాల లెక్కలు బయటికి రావడం లేదు.
పెట్టుబడి సాయమందించినా...
ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతున్నా రైతుల మరణాలు తగ్గడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. రైతుబంధు అందుతున్న 62.25 లక్షల రైతుల్లో సగం మంది రెండెకరాల లోపున్నవాళ్లే. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల సాగు భూమిలో సన్నకారు రైతుల చేతులో ఉన్నది కేవలం 33.38 లక్షల ఎకరాలే. ఈ వానాకాలం ప్రభుత్వ పెట్టుబడి సాయం రూ.7505.78 కోట్లలో వీళ్లకు అందింది రూ.1,669.41కోట్లే. అంటే పావు వంతు నిధులు కూడా పేద రైతులకు చేరడం లేదు. ప్రభుత్వ పెట్టుబడి సాయం ఏ మూలకూ చాలడం లేదని రైతు సంఘాలంటున్నాయి. పెట్టుబడి పెరిగి అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు అగ్రికల్చర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌, రైతు సంఘాల నేతలు అంటున్నరు.
రైతు బీమాలో ప్రత్యేక ఆప్షన్లు
రైతు బీమాలో డెత్‌‌‌‌ రికార్డింగ్‌‌‌‌లో ఇప్పటిదాకా ఉన్న ఆప్షన్లను పెంచుతూ ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రైతు బీమా పోర్టల్‌‌‌‌లో ఫార్మర్స్‌‌‌‌ డెత్‌‌‌‌ రికార్డింగ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ ఏర్పాటు చేసింది. మరణానికి కారణాలు, అధికారి పర్సనల్‌‌‌‌ విజిట్‌‌‌‌ చేసినట్లు, సోర్స్‌‌‌‌ఆఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌ ద్వారా నిర్ధారించుకునేందుకు కొత్త ఆప్షన్స్‌‌‌‌ ఇచ్చారు. బీమా పోర్టల్‌‌‌‌లో డెత్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసి డాక్యుమెంట్లు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ కాగానే నామినీకి డెత్‌‌‌‌ క్లెయిమ్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ వెళ్లేలా ఏర్పాటు చేశారు. కాజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డెత్‌‌‌‌లో కొత్తగా 3 ఆప్షన్లు పెంచారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఏఈవోలు రైతుల మరణాలను నమోదు చేసే అధికారాన్ని 30 రోజులకు పరిమితం చేశారు. 60 రోజుల లోపు ఎంఏవో, 90 రోజుల వరకు ఏడీఏ, 180 రోజుల్లోపు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి అవకాశం కల్పించారు. ఆపై మరణాల నమోదు అధికారం అగ్రికల్చర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌కు కల్పించారు.