ఊట్కూర్, వెలుగు: విద్యార్థులు తమ కెపాసిటీ పెంచుకునేందుకు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఊట్కూర్ ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో తరగతి విద్యార్థులతో లెక్కలు చేపించి, వారిని అభినందించారు. రెండో తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరిశీలించారు.
విద్యార్థులు సౌండ్ ఆధారంగా ఇంగ్లీష్ పదాలను చదివారు. అనంతరం స్కూల్ రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని హెచ్ఎంను ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, సీఎంవో రాజేంద్రకుమార్, ఎంఈవో మాధవి, కాంప్లెక్స్ హెచ్ఎం కుసుమ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని తిప్రాస్ పల్లి గ్రామ సమీపంలోని విజయ్ కాటన్ మిల్లును సందర్శించారు. రైతులతో మాట్లాడిన అనంతరం మిల్లులో కాంటాలు, కంప్యూటర్ లో కొనుగోళ్ల వివరాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ చింత రవి, ఏవో గణేశ్ రెడ్డి ఉన్నారు.
సెక్టోరియల్ ఆఫీసర్‌పై సీరియస్..
మహబూబ్‌నగర్(నారాయణపేట): విద్యాశాఖకు సంబందించిన ఫైళ్లు తహసీల్దార్ ఆఫీస్‌లో ఎందుకు ఉన్నాయని విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట తహసీల్దార్ ఆఫీస్‌ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ఆఫీస్‌లో ఒక వైపు ఉన్న ఫైళ్ల మూటలు తీయించాలని తహసీల్దార్ అమరేంద్ర కృష్ణను ఆదేశించారు.
ఫైల్స్ విద్యా శాఖకు సంబంధించినవని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న ఫైళ్లు, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లు, సాదా బైనామా అప్లికేషన్లు, భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ఇలా ఉంటే ఎలాగని అసంతృప్తి వ్యక్తం చేశారు.
