శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట జడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ కు క్లాస్ రూమ్ లో ఫ్యాన్ రెక్కలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం లంచ్ టైంలో విద్యార్థులు క్లాస్ రూమ్ లో నుంచి బయటకు వచ్చే ముందు ఆడుకుంటూ హర్షవర్ధన్ బెంచి ఎక్కాడు. దీంతో పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు అతడి తలకు బలంగా తగలడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు.
గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేయడంతో టీచర్లు పరిగెత్తుకు వచ్చి గాయపడ్డ హర్షవర్ధన్‌ను వెంటనే పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలపై 11 కుట్లు వేసి చికిత్స చేశారు. గాయపడ్డ విద్యార్థి హర్షవర్ధన్ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట. శివ్వంపేట ఎస్టీ బాయ్స్‌హాస్టల్‌లో ఉంటూ జడ్పీ హైస్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు.
