తడిసిన ధాన్యం కొనుగోలు.. బాధిత రైతు తారవ్వ ఖాతాలో రూ.2.55 లక్షలు జమ

తడిసిన ధాన్యం కొనుగోలు.. బాధిత రైతు తారవ్వ ఖాతాలో రూ.2.55 లక్షలు జమ

హుస్నాబాద్/హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ కారణంగా వర్షానికి తడిసిపోయిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసింది. శుక్రవారం 18 లారీలను ఏర్పాటు చేసి, 100 మంది రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 526 టన్నుల ధాన్యం  కొనుగోలు చేసి, వెంటనే జిల్లాలోని రైస్ మిల్లులకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని సివిల్ సప్లైస్​కమిషనర్ స్టీఫెన్​రవీంద్ర ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు డిప్యూటీ కమిషనర్‌ కొండలరావు, జీఎం ప్రొక్యూర్ మెంట్ నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు.

 వర్షానికి పూర్తిగా తడిసిన వరి ధాన్యాన్ని కోల్పోయి ఆందోళనలో ఉన్న తారవ్వ (పోతారం.ఎస్ గ్రామం) అనే మహిళా రైతుకు ప్రభుత్వం తక్షణ ఊరట కల్పించింది. ఆమెకు చెందిన 106.80 క్వింటాళ్ల వరి ధాన్యానికి కొనుగోలు చేసి, ఇందుకు సంబంధించి రూ.2,55,145 మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లై, రెవెన్యూ, పోలీస్‌, మార్కెటింగ్‌ మరియు వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు. కాగా.. తడిసిన ధాన్యాన్ని కొని, తన ఖాతాలో డబ్బులు జమ  చేయడంపై తారవ్వ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్​కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వడ్లను కొంటరో లేదోనని ఆందోళన చెందానని చెప్పారు.