మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం ఏదైనా ఉంటే అది తల్లిదండ్రులు – పిల్లల మధ్య ఉన్న అనుబంధం. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేస్తాడు. కానీ, కొన్ని సందర్భాల్లో అదే తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇలాంటి సంఘటనలు వార్తల్లో తరచుగా కనిపించినప్పుడు మనం షాక్‌కు గురవుతాం. మానసిక శాస్త్ర దృష్టితో పరిశీలిస్తే ఇది కేవలం ఒక క్రూరమైన నేరం మాత్రమే కాదు.
సమాజంలో మెల్లగా పెరుగుతున్న మానసిక, సామాజిక, ఆర్థిక ఒత్తిళ్ల సంక్లిష్ట ప్రతిఫలం అని కూడా అర్థమవుతుంది. మానసిక వైద్య శాస్త్రంలో తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేయడాన్ని ‘ఫిలిసైడ్’ అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు లోతుగా అధ్యయనం చేస్తున్న క్లిష్టమైన మానసిక, సామాజిక సమస్య. ఈ ఘటనలను అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి మానసిక స్థితి మాత్రమే కాకుండా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంక్షోభాలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలి.
పిల్లలపై జరిగే హత్యల్లో గణనీయమైన శాతం పరిచయస్తులు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే జరుగుతున్నాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 450 మంది పిల్లలు వారి తల్లిదండ్రుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లల హత్యల్లో దాదాపు 60 శాతం కేసుల్లో నేరస్తులు తల్లిదండ్రులే అనే విషయం పరిశోధనల్లో బయటపడింది. ఈ సంఘటనలలో సుమారు 30 నుంచి 40 శాతం వరకు తీవ్రమైన మానసిక వ్యాధులు లేదా మానసిక అస్థిరతలు కారణమవుతున్నాయి.
ఇంకా ఒక ఆసక్తికరమైన గమనిక ఏమిటంటే చిన్న శిశువుల మరణాల్లో ఎక్కువగా తల్లుల పాత్ర కనిపిస్తుండగా, పెద్ద వయస్సు పిల్లల హత్యల్లో తండ్రుల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యను కేవలం క్రిమినల్ కోణంలో చూడడం సరిపోదు. దీనిలో మానసిక ఆరోగ్య అంశం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
ఇరు రాష్ట్రాల్లో పరిస్థితి
తెలంగాణలో ప్రతి సంవత్సరం సగటున 40 నుంచి 60 వరకు పిల్లల హత్యలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య సుమారు 35 నుంచి 50 మధ్య ఉంటుంది. వీటిలో చాలా కేసుల్లో కుటుంబ వివాదాలు, మానసిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో పిల్లలపై నమోదైన నేరాల సంఖ్యను పరిశీలిస్తే ఒక ఆందోళనకర ధోరణి కనిపిస్తుంది.
2014లో సుమారు 1,820 కేసులు నమోదైనాయి. ఏటా పెరుగుతూ 2023లో సుమారు 3,700 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ప్రాంతంలో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. 2023లో సుమారు 2,840 కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలపై నేరాలు దాదాపు 70 శాతం పెరిగాయి.
ప్రధాన కారణాలు
మానసిక శాస్త్ర పరిశోధకుడు డాక్టర్ ఫిలిప్ రెస్నిక్ ఈ ఘటనలను ఐదు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు. మొదటిది ‘కరుణతో చేసిన హత్య’. ఇది వినడానికి విరుద్ధంగా అనిపించినా కొంతమంది తల్లిదండ్రులు ‘పిల్లలు ఈ ప్రపంచంలో బాధపడకూడదు’ అనే భ్రమతో ఈ ఘోర నిర్ణయం తీసుకుంటారు.
తీవ్రమైన పేదరికం, భవిష్యత్తుపై నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు వంటి పరిస్థితుల్లో ఈ రకం ఘటనలు చోటుచేసుకుంటాయి. తల్లిదండ్రులు దీనిని నేరంగా కాకుండా పిల్లలను బాధ నుంచి రక్షించడం అని భావించే ప్రమాదకరమైన మానసిక భ్రమలో ఉంటారు.
రెండోది ‘మానసిక వ్యాధి ప్రభావం’. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. స్కిజోఫ్రేనియా, తీవ్రమైన భ్రాంతులు, లేదా ప్రసవానంతర మానసిక వికారం వంటి పరిస్థితుల్లో వాస్తవం, ఊహ మధ్య తేడా గుర్తించలేని స్థితి ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో తల్లులు పిల్లలో దుష్టశక్తి ఉందని భ్రమించి హత్య చేసిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. మూడోది ‘నిరంతర హింస దశ’. పిల్లలపై పదేపదే జరిగే శారీరక హింస ఒక దశలో ప్రాణాంతకంగా మారుతుంది. కోపం నియంత్రణ కోల్పోవడం, తీవ్రంగా కొట్టడం, ఆకలికి దూరం పెట్టడం వంటి చర్యలు చివరికి ప్రాణ నష్టానికి దారితీస్తాయి.
నాల్గవది ‘అవాంఛిత పిల్లల హత్య’. కొన్ని కుటుంబాల్లో పిల్లలను ఒక భారంగా భావించే పరిస్థితులు ఏర్పడతాయి. అవాంఛిత గర్భధారణ, ఆర్థిక కష్టాలు, కుటుంబ ఒత్తిడులు వంటి కారణాలు దీనికి దారితీస్తాయి. కొన్ని దేశాల్లో ఆడ పిల్లల హత్యలు కూడా ఈ వర్గంలోకి వస్తాయి. భారతదేశంలో గత రెండు దశాబ్దాల్లో లక్షల సంఖ్యలో ఆడశిశువుల భ్రూణాలు గర్భంలోనే తొలగించారు. ఇక అయిదవది ‘ప్రతీకార హత్య’. ఇది అత్యంత క్రూరమైన రూపం. భార్య లేదా భర్తపై కోపంతో పిల్లలను హత్య చేయడం జరుగుతుంది. విడాకులు, దాంపత్య విభేదాలు వంటి సందర్భాల్లో పిల్లలు ప్రతీకార సాధనంగా మారిపోతారు.
ఈ సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి ?
సమాజంలో జరిగిన నిర్మాణాత్మక మార్పులు ఈ సమస్య పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం వల్ల కుటుంబ మద్దతు తగ్గింది. పట్టణ జీవనశైలి, ఆర్థిక అసమానతలు, ఉద్యోగ ఒత్తిడులు, అక్రమ సంబంధాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి సంఘటనలు జరిగే ముందు చాలా సందర్భాల్లో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. ‘పిల్లలతో కలిసి చనిపోతాను’, ‘జీవితానికి అర్థంలేదు’, ‘బతికి సాధించేదేమీ లేదు’ వంటి మాటలు కొందరు తల్లిదండ్రులు ముందుగానే పలుకుతుంటారు. ఈ సంకేతాలను సమయానికి గుర్తిస్తే అనేక విషాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
పరిష్కార మార్గాలు
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల మరణాలు మనిషి సహజ ప్రేమకు పూర్తిగా విరుద్ధంగా కనిపించే విషాదాలు. కానీ, మానసిక శాస్త్రం చెప్పే ఒక నిజం ఏమిటంటే.. ఈ ఘోర నిర్ణయాలు ఒక్కరోజులో ఏర్పడవు. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా పెరుగుతున్న మానసిక చీకటి చివరకు ఈ విషాదానికి దారితీస్తుంది. అందుకే ఈ సమస్యను తగ్గించాలంటే కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే సరిపోవు. సమాజం మొత్తం మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి.
ముఖ్యంగా ప్రసవానంతర మానసిక పరీక్షలు, కుటుంబ కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పిల్లల రక్షణ వ్యవస్థలు బలపరచడం అవసరం. తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల మరణాలు వ్యక్తిగత నేరాలుగా మాత్రమే చూడలేం. అవి సమాజంలో పెరుగుతున్న మానసిక సంక్షోభానికి ఒక ప్రతిబింబం. పిల్లలను రక్షించాలంటే చట్టాలతోపాటు సమాజం మానసిక ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం తన పిల్లలను ఎంత సురక్షితంగా పెంచుతోంది అనేదానిపై ఆ దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
డాక్టర్. బి.హర్షిణి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
