సీఎం సంకల్పం మూసీ-విషం నుంచి వరం

సీఎం సంకల్పం మూసీ-విషం నుంచి వరం

ఒకప్పుడు మా ఉమ్మడి నల్గొండ  జిల్లా రైతుల పాలిట జీవనాడి.. పసిడి పంటలు  పండించిన పవిత్ర జలధార మూసీ. కానీ, కాలక్రమంలో భాగ్య నగరపు మురుగు, పారిశ్రామిక వ్యర్థాలను మోసుకొచ్చే మృత్యువాహినిగా మారింది. తాగడానికి కాదు, కనీసం ఆ నీటిని  చేత్తో పట్టుకోవడానికి కూడా పనికిరాదని సాక్షాత్తు  ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పింది.

సాక్షాత్తు  ప్రధాని టేబుల్​పై  బక్కచిక్కిన  నల్గొండ వాసి దేహం పరిచినా,  ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎందర్ని ప్రాధేయపడినా ఆ కాలకూట విషం రోజురోజుకూ చిక్కబడిందే కాని,  స్వచ్ఛమైన  తాగునీరు  మా గొంతుకు చేరలేదు. సగటు నల్గొండ వాసిగా దశాబ్దాలుగా మా గుండెలను తొలిచేస్తున్న ఈ ఆవేదన అంతా ఇంతా కాదు. మూసీ కాలుష్యానికి తోడు, ఆ జలాలు మా నల్గొండ భూమిలో ఇంకిపోయాయి. ఫలితంగా మా ప్రజలు లోతైన బోర్లపై ఆధారపడాల్సి వచ్చింది.  తాగేనీటిలో ఫ్లోరైడ్ శాతం విపరీతంగా పెరిగిపోయి వంకర్లు పోయిన కాళ్లు, వంగిన వెన్నె ముకలతో ఎందరి బతుకులో దీనంగా మారాయి. 

వ్యవసాయ భూములు విషతుల్యం
దశాబ్దాలుగా  పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలవడం వల్ల వ్యవసాయ భూములు విషతుల్యమయ్యాయి.  ఈ నీటితో  పండిన పంటల్లోకి విషతుల్య లోహాలు ప్రవేశించి, మా పళ్లెంలోకి విషం చేరింది. ఈ పంటల్ని అమ్ముకోవడంలోనూ మా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. 

జాతీయ పర్యావరణ  ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ,  రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మూసీ జలాలపై సర్వేలు చేశాయి. వాటి నివేదికల సారాంశం ఒక్కటే.. మూసీ జలాలు వ్యవసాయానికి,  పశువులు  తాగడానికి కూడా పనికిరావు. ఫ్లోరైడ్  విముక్తి కోసం, స్వచ్ఛమైన నీటికోసం 'జల సాధన సమితి' లాంటి  సంఘాల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ నేతృత్వంలో  వీధి పోరాటాల నుంచి ఢిల్లీ దాకా మా గొంతు వినిపించాం.

నల్గొండ ప్రజల్లో కొత్త ఆశలు
గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలు విన్నాం.. ఊకదంపుడు ఉపన్యాసాలు చూశాం. కానీ, మూసీ ప్రక్షాళన మాత్రం ఎన్నికల నాటి కలగానే మిగిలిపోయింది.  సరిగ్గా ఇలాంటి తరుణంలో  ప్రస్తుత ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సారథ్యంలోని   ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రిజువనేషన్ ప్రాజెక్టు మా నల్గొండవాసుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

కేవలం మురుగును శుద్ధి చేయడమే కాకుండా, నదికి పూర్వ వైభవం తీసుకువచ్చే ఈ బృహత్తర ప్రాజెక్టు మా నల్గొండ ప్రజల పాలిట సంజీవని లాంటిది. గోదావరి  జలాలతో మూసీకి జీవం పోయాలన్న  ప్రభుత్వ ప్రణాళిక  అద్భుతమైనది. ఓ వైపు రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు ఇబ్బంది పెడుతున్నా... మొక్కవోని సంకల్పంతో రేవంత్​ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాలో ఆశల్ని చిగురిస్తోంది.

ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యం సరికాదు
10వేలకు పైగా మూసీ నిర్వాసితుల్ని ప్రభుత్వం కచ్చితంగా గుర్తించి వారికి పునరావాసాన్ని, ఇళ్లతోపాటు ఉపాధిని ఆహ్లాదకరమైన వాతావరణంలో అదే స్థానికంగా అందజేస్తుంటే... తిరిగి వాళ్లను అదే మూసీలో బతకాలని ప్రతిపక్షాలు చెప్పడం  ఎంత బాధ్యతారాహిత్యమో ఆలోచించండి.  కలుషిత మూసీతో   దశాబ్దాలుగా  మా నల్గొండ  ప్రజలు అనుభవించిన బాధలకు పరిష్కారం దొరకకుండా అడ్డుకోవాలని చూస్తే కచ్చితంగా అదేరీతిలో బుద్ధిచెప్తాం. 

ఓవైపు మా నల్గొండకే కాదు యావత్  రాష్ట్రానికి  తద్వారా  దేశానికి  గ్రోత్ ఇంజిన్​గా 55  కిలోమీటర్ల  మేర మూసీని  సుందరీకరించి, ప్రకృతిని కాపాడడమే కాకుండా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటే... మరోవైపు తమ కుట్రలతో దీన్ని అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం.  ఈ మంచిపనితో చరిత్రలో  రేవంత్ రెడ్డి నిలుస్తాడు,   ఈ ప్రాజెక్టుతో పర్యావరణమే కాకుండా,  మా ఉమ్మడి నల్గొండ జిల్లా  రైతుల తలరాత కూడా మారుతుంది.  దశాబ్దాల మా గోసను తీరుస్తూ,  మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి  ప్రజా ప్రభుత్వానికి నల్గొండ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు.

పున్నా కైలాష్ నేత, అధ్యక్షుడు, నల్గొండ డీసీసీ

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.