
హైదరాబాద్/ముషీరాబాద్, వెలుగు: హైకోర్టు చెప్పినా ఉద్యోగాలు ఇవ్వరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని 2008 డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13 ఏండ్లుగా తమకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి అభ్యర్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ‘‘కేసీఆర్ సారూ.. కరుణించండి” పేరుతో నిరసన తెలిపారు. దీనికి సీపీఎం, ఆప్ పార్టీలతో పాటు పలు టీచర్ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుకు తెలంగాణలోని 1,100 మంది మెరిట్ ఉన్నా ఉద్యోగాలు పొందలేకపోయారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ అది ఇంకా అమలుకు నోచుకోలేదని వాపోయారు. అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
కేసీఆర్.. హామీ నిలబెట్టుకోవాలె
అభ్యర్థుల పోరాటం న్యాయమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహారావు అన్నారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. హైకోర్టు తీర్పు కూడా వారికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దాలని ఆప్ నేత ఇందిరా శోభన్ అన్నారు. అభ్యర్థులు13 ఏండ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీఆర్టీయూ నేతలు కూడా మద్దతు ఇచ్చి మాట్లాడారు. నిరాహార దీక్షలో డీఎస్సీ 2008 బీఈడీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉమామహేశ్వర్ రెడ్డి, సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.