ఎడ్యుకేషన్ లోన్లు  25 శాతమే ఇవ్వడమేంటి? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎడ్యుకేషన్ లోన్లు  25 శాతమే ఇవ్వడమేంటి? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • దిశ మీటింగ్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్లు, ప్లై ఓవర్ల నిర్మాణంలో జాప్యమెందుకని ప్రశ్న

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లోని వేలాది విద్యాసంస్థల్లో లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కేవలం 25 శాతం ఇవ్వడం ఏమిటని బ్యాంకర్లను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు పెంచాల్సిందేనని, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకున్నా రూ. 7 లక్షల వరకు లోన్లు ఇవ్వవచ్చన్నారు. శుక్రవారం ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌‌డీ భవన్​లో దిశ కమిటీ మీటింగ్​జరిగింది. ఇందులో కేంద్రమంత్రితో పాటు కలెక్టర్ హరిచందన దాసరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెద్దఎత్తున అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

తలసేమియా పేషెంట్లకు స్పెషల్ క్యాంపులు పెట్టాలి 

సమావేశం అనంతరం కలెక్టర్ తో కలిసి శాఖల వారీగా పథకాల అమలుపై కేంద్ర మంత్రి సమీక్షించారు. కోల్ ఇండియా దవాఖానలతో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్​లో తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేలా స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. సిటీలో ట్రాఫిక్, పొల్యూషన్, వాటర్ సమస్యలపై  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

ప్రపోజల్స్​కరెక్ట్​ ఇస్తే నిధులు తెస్తా

జిల్లాలో స్కీంలకు ప్రతిపాదనలు సరైన రీతిలో అందజేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందేలా కృషి చేస్తానని కేంద్ర మంత్రి అన్నారు. జాతీయ రహదారులు, సిటీలోని మెయిన్​రోడ్లు, ప్లై ఓవర్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. అంబర్ పేట ప్లై ఓవర్ కింద సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగంగా పూర్తి చేస్తామని ఆఫీసర్లు మంత్రికి వివరించారు. స్కూళ్లలో  మౌలిక వసతులపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు సత్వరమే స్పందించి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 

గతేడాది 117 లిప్రసీ కేసులు నమోదు

హైదరాబాద్ జిల్లాలో గత ఏప్రిల్​నుంచి ఫిబ్రవరి వరకు 117 లిప్రసీ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్​వో వెంకటి తెలిపారు. మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ లేకుండా వ్యాధి విస్తరిస్తోందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నామని, దీన్ని లైట్ గా తీసుకోవద్దని డీఎంహెచ్‌ఓ అన్నారు. 108 అంబులెన్సుల ద్వారా 2026 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 20,235 మందిని కాపాడమని చెప్పారు. 

శిథిలావస్థ వాంబే ఇండ్ల తొలగింపు 

కేంద్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్‌లో నిర్మించిన వ్యాంబే, ఈడబ్ల్యూఎస్  ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, 12 కాలనీల్లో భవనాల తొలగింపునకు అంగీకారం తెలపడంతో పునర్నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వానికి  ప్రతిపాదనలు పంపించామని గృహనిర్మాణ శాఖ ఆఫీసర్ తెలిపారు. వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్ జితేందర్ రెడ్డి, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య, సీపీఓ డాక్టర్ సురేందర్,  డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటి,  సంక్షేమ అధికారులు ఆశన్న,  కోటజీ, ప్రవీణ్ కుమార్, ఇలియాస్ అహ్మద్, పరిశ్రమల శాఖ జీఎం పవన్ కుమార్ పాల్గొన్నారు.

ప్రత్యేక దృష్టి పెడతాం: కలెక్టర్​ హరిచందన 

కలెక్టర్ హరి చందన మాట్లాడుతూ  సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై  ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ సిద్ధం చేసి పలు విభాగాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర  సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామని వివరించారు. జిల్లాలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక చేయూతకు మెరుగైన అవకాశాలు కల్పిస్తామని వివరించారు.