ధర పెరిగిందని.. మీ బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో దాచారా..? : బ్యాంక్ లో ఏదైనా జరిగితే నష్టపరిహారం, నష్టం ఏంటో తెలుసా..?

ధర పెరిగిందని.. మీ బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో దాచారా..? : బ్యాంక్ లో ఏదైనా జరిగితే నష్టపరిహారం, నష్టం ఏంటో తెలుసా..?

చాలామంది తమ నగలు, విలువైన పత్రాలను బ్యాంక్ లాకర్‌లో పెడితే ఇక నిశ్చింతగా ఉండొచ్చని అనుకుంటుంటారు. బ్యాంక్ భద్రత ఉంది కదా.. ఇంకేం అవుతుంది? అన్నదే అందరి నమ్మకం. కానీ అసలు నిజం ఏమిటంటే.. మీ లాకర్‌లో ఉన్న సొత్తుకు ఏదైనా జరిగితే బ్యాంక్ ఇచ్చే పరిహారం మీరు ఊహించిన దానికంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం అసలు చాలా మందికి తెలియదు.RBI రూల్స్ ప్రకారం లాకర్ల భద్రత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చేదు నిజాలు ఇక్కడ ఉన్నాయి.

ఒకవేళ బ్యాంకులో దొంగతనం జరిగినా, బిల్డింగ్ కుప్పకూలినా లేదా బ్యాంక్ సిబ్బంది మోసానికి పాల్పడినా.. బ్యాంక్ మీకు ఇచ్చే పరిహారం కేవలం మీ వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. అంటే ఉదాహరణకు మీరు ఏడాదికి రూ.2వేలు అద్దె కడుతుంటే, బ్యాంకు మీకు ఇచ్చే మ్యాక్సిమం పరిహారం కేవలం రూ.2 లక్షలు మాత్రమే. అంటే మీరు రూ.5 లక్షలు విలువైన గోల్డ్ ఆభరణాలు లాకర్ లో పెట్టి ఏదైనా కారణం వల్ల అవి మిస్ అయితే వస్తువు అసలు విలువలో సగం కూడా రాదని గుర్తుంచుకోండి. ప్రస్తుత బంగారం ధరల ప్రకారం రూ.2 లక్షలకు ఒక చిన్న నెక్లెస్ కూడా రాదు. లాకర్‌లో కోటి రూపాయల నగలున్నా సరే..రూల్స్ ప్రకారం బ్యాంకు ఇచ్చేది ఆ పరిమిత మొత్తమే.

ప్రకృతి విపత్తుల విషయంలో..

చాలామందికి తెలియని మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి ప్రకృతి విపత్తుల వల్ల మీ లాకర్‌లోని నగలు డ్యామేజ్ అయితే బ్యాంక్ పైసా కూడా చెల్లించదు. లాకర్ గది ఎంత పటిష్టంగా ఉన్నా.. ఆర్థికపరమైన నష్టానికి మాత్రం కస్టమర్‌దే పూర్తి బాధ్యత అని మెుదట్లో లాక్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉంటుంది. మనం సంతకం చేసే అగ్రిమెంట్లలో ఈ విషయాలన్నీ చిన్న అక్షరాలతో ఉంటాయి, అందుకే మనం వాటిని పెద్దగా పట్టించుకోం.

బ్యాంకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయదు?

బ్యాంకులు వాస్తవానికి లాకర్ లోపల కస్టమర్ ఏం దాచుకున్నారో చూడవు. ఆ వివరాలను రికార్డు చేయవు. కాబట్టి లోపల ఉన్న వస్తువులకు బ్యాంక్ ఇన్సూరెన్స్ చేయదు, చేయలేదు కూడా. అందుకే ఆ బాధ్యతను కస్టమర్ల మీదకే నెట్టేస్తారు. ఒకవేళ మీ నగలకు పూర్తి రక్షణ కావాలంటే.. మీరే విడిగా జువెలరీ ఇన్సూరెన్స్ లేదా హోమ్ ఇన్సూరెన్స్‌లో భాగంగా నగలకు కవర్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే దొంగతనంతో పాటు ప్రకృతి విపత్తుల నుంచి కూడా మీ సొత్తుకు పూర్తి భద్రత లభిస్తుంది.

మరి ఆల్టర్నేట్ ఏంటి..?

కేవలం లాకర్ మీదనే ఆధారపడకుండా.. అప్పుడప్పుడు వాడే నగల కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. లేదా గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ వంటి పద్ధతులను ఎంచుకోవచ్చు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.. లాకర్ కేవలం భౌతిక రక్షణ మాత్రమే ఇస్తుందని, ఆర్థిక రక్షణ ఇవ్వదని గుర్తించడం ముఖ్యం. గుడ్డిగా బ్యాంకు లాకర్లో పెట్టా వాటికి ఏం కాదులే అంతా సేఫ్ అని మర్చిపోయారో అనుకోనిది జరిగితే ఊహించని ఆర్థిక నష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది జాగ్రత్త.