డ్రగ్ టెస్టుకు ఇన్ని రోజులు ఎందుకు ముందుకు రాలే : కేటీఆర్​పై సంజయ్ ఫైర్

డ్రగ్ టెస్టుకు ఇన్ని రోజులు ఎందుకు ముందుకు రాలే : కేటీఆర్​పై సంజయ్ ఫైర్
  • డ్రగ్ కేసును ఎందుకు మూసేసిన్రు? 
  • సిట్ రిపోర్టును బయటపెట్టండి  
  • వేములవాడ, ధర్మపురికి మీ అయ్య ఇస్తానన్న డబ్బులేవీ? 

కరీంనగర్ టౌన్, వెలుగు: మంత్రి కేటీఆర్ కామెంట్లకు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తన చాలెంజ్​పై కేటీఆర్ ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా కేటీఆర్ తీరు ఉందని విమర్శించారు. కేటీఆర్ మూడు నెలలు విదేశాల్లో ట్రీట్ మెంట్ చేయించుకున్నారని, అందుకే ఇప్పుడు డ్రగ్ టెస్టుకు సిద్ధమంటున్నారని మండిపడ్డారు. బుధవారం కరీంనగర్  చైతన్యపురిలోని మహాశక్తి టెంపుల్ వద్ద మీడియాతో సంజయ్ మాట్లాడారు.

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ఎందుకు ఆపేశారని ఆయన ప్రశ్నించారు. ఇందులో పెద్ద మొత్తంలో విదేశీ లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసును ఎందుకు మూసివేశారని, దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో తేల్చాలని, సిట్ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘నేను తంబాకు తింటున్నానని కేటీఆర్ ఆరోపణలు చేసినప్పుడే పరీక్షకు సిద్ధమని చెప్పాను. మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు రాలేదు” అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ఫ్యామిలీకి డబ్బు మదమెక్కింది? 

సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి డబ్బు మదమెక్కిందని సంజయ్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ నన్ను ఆరు ముక్కలు చేస్తనన్నడు.. ఇప్పుడు ఆయన కొడుకు చెప్పుతో కొడ్తనని అంటున్నడు. ఆ కుటుంబానికి డబ్బు ఎక్కువై మదంతో మాట్లాడుతున్నరు” అని ఫైర్ అయ్యారు. కవిత లిక్కర్ కేసుపై కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, సెస్ ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వేములవాడ, ధర్మపురికి మీ అయ్య ఇస్తానన్న డబ్బులేవీ? పైగా భక్తులిచ్చిన డబ్బుల్ని కూడా వాడుకుంటున్నరు. తీగలగుట్టపల్లి వంతెన మీ చుట్టపోడు ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? నేను వచ్చాకే ఆర్వోబీ కోసం కేంద్ర వాటాపై ఫైనాన్షియల్ అప్రూవల్ తెచ్చిన. రాష్ట్ర వాటా కింద రూ.80 కోట్లు ఎందుకివ్వడం లేదు” అని కేటీఆర్ పై మండిపడ్డారు. ‘‘మమ్మల్ని ప్రశ్నించేముందు.. మీ అయ్య ఇచ్చిన హామీల సంగతేందో చూడాలి” అని సూచించారు. బీఆర్ఎస్ నేతలకు బూతులు తిట్టడం తప్ప..  ఏదీ చేతకాదని విమర్శించారు. గంగాధర, తీగలగుట్టపల్లి ఆర్వోబీలు మంజూరయ్యాయని చెప్పారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకే పోరాటం చేస్తున్నామన్నారు. దేవుడిని నమ్మని నాస్తికుడు కేటీఆర్ అని విమర్శించారు.

ఎన్నికలకు సిద్ధమవ్వండి..

పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు సంజయ్ పిలుపునిచ్చారు. బుధవారం రేకుర్తిలోని శ్రీసాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా, మండల పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలని, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. జిల్లాలోని అన్ని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగింది. కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం బీజేపీ శ్రేణులు నడుం బిగించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా పని చేయాలి” అని పిలుపునిచ్చారు.