ముషీరాబాద్ ఎందుకు మునిగిపోయింది : మనుషులు కొట్టుకుపోయేంత వరద ఎక్కడి నుంచి వచ్చింది..?

ముషీరాబాద్ ఎందుకు మునిగిపోయింది : మనుషులు కొట్టుకుపోయేంత వరద ఎక్కడి నుంచి వచ్చింది..?

హైదరాబాద్ ​ వెలుగు: హైదరాబాద్​ నగరంలో కుండపోత వానపడింది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వాన దంచికొట్టడంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ముషీరాబాద్‌‌‌‌లో అత్యధికంగా12 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.

ముషీరాబాద్​విలవిల 

ముషీరాబాద్‌‌‌‌లో భారీ వర్షానికి బాపూజీనగర్, ఎంసీహెచ్​కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇండ్లు, రోడ్లపై వర్షపు నీరు పోటెత్తడంతో వాహనాలు  కొట్టుకుపోయాయి. చిక్కడపల్లి పీఎస్ ఎదురుగా వివేక్ నగర్ లోని ఓ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోకి వరద చేరింది. ఇందిరా పార్క్, దోమలగూడ, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరద నీటితో నిండిపోయాయి. స్టీల్ బ్రిడ్జి పైనుంచి..  కాలనీ, బస్తీల నుంచి భారీ వరద చేరి మెయిన్​రోడ్డును ముంచెత్తింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అశోక్ నగర్ నుంచి దోమల్‌‌‌‌గూడ వెళ్లే మార్గం పూర్తిగా వరదతో నిండిపోయింది. దోమలగూడలోని పలు అపార్ట్​మెంట్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ముషీరాబాద్ వినోభానగర్ కు చెందిన 23 ఏండ్ల దినేశ్‌‌‌‌ (సన్నీ) ఇంటి సమీపంలోని నాలాలో కొట్టుకుపోయాడు.  భారీ వర్షానికి. గాంధీ దవాఖాన వెనుకవైపు నుంచి ముషీరాబాద్ బస్తీల్లోకి వచ్చే నాలాలు  పొంగిపొర్లాయి. వరద నీటిని అంచనా వేయలేక ముషీరాబాద్ వినోభానగర్ వద్ద నాలాను బైక్‌‌‌‌పై దాటడానికి ప్రయత్నించిన దినేశ్​టూ వీలర్‌‌‌‌‌‌‌‌తో సహా కొట్టుకుపోయాడు. సన్నీ ప్రైవేట్‌‌‌‌ జాబ్​చేస్తుంటాడు. ఇతడికి భార్య, కొడుకు ఉన్నారు.  పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా బృందాలు  సంఘటనా స్థలానికి చేరుకొని, నాలాలో కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు.


రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం అదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురంలో 8.1 సెంటీమీటర్లు, కొత్తగూడెం జిల్లా మణుగూరులో 7.7, ఖమ్మం జిల్లా కల్లూరులో 6.9, ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 6.3, కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలో 6.3, ములుగు జిల్లా ఏటూరు నాగరంలో 6, నల్గొండ జిల్లా గుడిపల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, అబుల్లాపూర్ మేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.