దాడులు చేస్తున్నమని ముందే పాక్కు ఎందుకు చెప్పారు? కేంద్రానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న

దాడులు చేస్తున్నమని ముందే పాక్కు ఎందుకు చెప్పారు? కేంద్రానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టే ముందు పాకిస్తాన్ కు ఎందుకు సమాచారం ఇచ్చారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. టెర్రర్ క్యాంపులపై దాడులు చేస్తున్నామని పాక్ కు ముందే సమాచారం ఇవ్వడం వల్ల ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ లు కోల్పోవాల్సి వచ్చిందని నిలదీశారు. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నామని పాక్ కు ముందే సమాచారం ఇచ్చామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ గుర్తుచేశారు.

 దాడి చేయడానికి ముందు ఇలా సమాచారం ఇవ్వడం నేరమన్నారు. అసలు ఈ సమాచార చేరవేతకు అంగీకారం తెలిపిందెవరు? దీని ఫలితంగా మన ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానాలు ఎన్నింటిని కోల్పోయామో కేంద్రం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు జైశంకర్ ఇటీవలి మీడియా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోతో శనివారం ట్వీట్​చేశారు. 

ఈ వీడియోలో.. ‘సైనిక చర్య ప్రారంభించే ముందు పాకిస్తాన్ కు సందేశం పంపించాం. ఉగ్రవాద క్యాంపులపైనే మేం దాడులు చేస్తున్నాం, మీ సైన్యం జోలికి రావట్లేదని చెప్పాం. అంటే పాక్ సైన్యానికి ఓ ఆప్షన్ ఉంది. ఈ విషయంలో కల్పించుకోకుండా ఉండే చాయిస్ ఉండె. అయినా సరే, కల్పించుకోకండి అంటూ మేం ఇచ్చిన మంచి సలహాను పాక్ పెడచెవిన పెట్టింది’ అంటూ జైశంకర్ చెప్పడం కనిపిస్తోంది.

రాహుల్​ ఫ్యాక్ట్ చెక్ చేసుకో.. బీజేపీ కౌంటర్​

విదేశాంగ మంత్రి జైశంకర్ పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాడులు ప్రారంభించేముందు పాకిస్తాన్ కు చెప్పామని కేంద్ర మంత్రి జైశంకర్ ఎక్కడా చెప్పలేదని, సదరు వీడియో ఆపరేషన్ సిందూర్ తర్వాతిదని పీఐబీ తేల్చింది. 

దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆపరేషన్ సిందూర్ తొలిదశలో అంటే ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన తర్వాత పాక్ కు సమాచారం ఇచ్చి  ఈ విషయంలో కల్పించుకోవద్దని హెచ్చరించామని మాత్రమే మంత్రి తెలిపారని వివరించింది. దీనిని టెర్రర్ క్యాంపులపై దాడులకు ముందు అంటూ తప్పుడు అర్థాలు తీసి ప్రచారం చేస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.