హిందూ సంప్రదాయంలో మహాలయ పక్షం అనేది పితృదేవతలను స్మరించి, వారికి తర్పణం, పిండప్రదానం, శ్రాద్ధం వంటి కర్మలు చేయడానికి ముఖ్యమైన కాలంగా భావిస్తారు. మహాలయ పక్షం చివరి రోజైన ( 2026 అక్టోబర్ 10) మహాలయ అమావాస్యను ప్రత్యేకంగా పితృకార్యాలకు అనుకూలమైన రోజుగా భావిస్తారు.
మహాలయ అమావాస్య ప్రత్యేకత
భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని అనేక సంప్రదాయాల్లో పితృపక్షం లేదా మహాలయ పక్షంగా పరిగణిస్తారు. ఈ పక్షంలోని ప్రతి రోజూ పితృదేవతలకు తర్పణం చేయాలి. కాని కలియుగంలో ఇది సాధ్యం కాదు. కనీసం పితృ దేవతలు శరీరం విడిచి పెట్టిన తిథి రోజున తర్పణాలు వదలాలి. మరణించిన తిథి తెలియకపోతే చివరి రోజైన మహాలయ అమావాస్యనాడు పితృకర్మ చేయాలి. అప్పుడు పితృదేవతలు సంతృప్తి చెందుతారు.
పితృదేవతల స్మరణ
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తాతముత్తాతలు, పూర్వీకుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడం ఈ ఆచారం వెనుక ప్రధాన భావన. వారి వల్లే మన వంశం కొనసాగుతోంది. అందుకే మహాలయ అమావాస్య పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు . గరుడ పురాణం ప్రకారం ఆ రోజు ( 2026 అక్టోబర్ 10)న వారిని స్మరించుకొని ఆశీర్వాదం కోరే సంప్రదాయం కొనసాగుతుంది.
తర్పణాలు ఎందుకు
నీటిలో నువ్వులు కలిపి పితృదేవతలను స్మరిస్తూ సమర్పించడాన్ని తిల తర్పణం అంటారు. ఇది పూర్వీకుల పట్ల మన కృతజ్ఞతను, గౌరవాన్ని వ్యక్తం చేసే ఆచారంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
పిండప్రదానం ఎందుకు చేయాలి
అన్నంతో తయారు చేసిన పిండాలను పితృదేవతలకు సమర్పించడం శ్రాద్ధకర్మలో ఒక ముఖ్యమైన భాగం. కుటుంబ సంప్రదాయం ప్రకారం పితృదేవతల కోసం పిండప్రదానం చేస్తారు. పుణ్య నదుల తీరంలో కొంతమంది ఈ క్రతువును నిర్వహిస్తారు.
కాకులకు అన్నం
హిందూ సంప్రదాయంలో కాకిని పితృదేవతలతో అనుబంధం ఉన్నదిగా భావించే ఆచారం ఉంది. అందుకే పితృకర్మ అనంతరం కాకులకు అన్నం పెడుతుంటారు. ఆహారం తినేందుకు కాకులు రాకపోతే దేహం విడిచిన వారు సంతృప్తిగా లేరని భావిస్తారు. అయితే కాకి తప్పనిసరిగా వచ్చి ఆహారం తినాలి, అప్పుడే పితృదేవతలు తృప్తి చెందుతారు ..
పితృదేవతలను పూజించకపోతే కలిగే నష్టం
ఇది చాలామందికి ఉండే సందేహం. పితృకర్మ చేయకపోతే తప్పకుండా కష్టం వస్తుంది, దోషం ఏర్పడుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. పితృకర్మ ప్రధానంగా కృతజ్ఞత, కుటుంబ సంప్రదాయం, పూర్వీకులను స్మరణ చేయాలని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది.
గోత్రం తెలియకపోతే ఏం చేయాలి
గోత్రం తెలియకపోయినా పితృదేవతలను భక్తితో స్మరించాలి. “జ్ఞాతా..జ్ఞాత పితృదేవతలందరికీ నమః” అని ప్రార్థించి తర్పణం చేయాలి. మహాలయ అమావాస్యను కేవలం భయంతో కాకుండా పూర్వీకుల పట్ల కృతజ్ఞతతో ఆచరించాలి. . తర్పణం, శ్రాద్ధం చేయడంతో పాటు అన్నదానం .. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.
మహాలయ అమావాస్యనాడు పితృదేవతలను స్మరించడం అంటే మన వంశాన్ని, మనకు ముందున్న తరాలను గుర్తుచేసుకుని వారికి గౌరవం, కృతజ్ఞతలు సమర్పించడం. తర్పణం, శ్రాద్ధం, పిండప్రదానం, అన్నదానం వంటి ఆచారాలు ఈ స్మరణకు సంప్రదాయ రూపాలని పండితులు చెబుతున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారికి మాత్రమే పిండ ప్రదానం చేయాలి. అలాగే తండ్రి జీవించి ఉండి.. తల్లి కాలం చేసిన ఎడల... అలాంటి వారు ఒక్క తల్లికి మాత్రమే తర్పణాలు వదలాలి. ఆడ పిల్లలు మాత్రమే ఉండి వారి తల్లి దండ్రులు మరణించిన ఎడల పెద్ద కుమార్తె మొదటి కుమారుడు ( దౌహోత్రుడు) అమ్మమ్మ.. తాతయ్యలకు కేవలం తర్పణాలు మాత్రమే వదలాలి. పిండ ప్రదానం చేయరాదు.. ఒకవేళ అలాంటి సందర్భంలో కార్యక్రమం చేసే వ్యక్తికి తండ్రి జీవించి లేకపోతే ... పిండ ప్రదానం కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
మనం తెలిసో.. తెలియకో... కొంతమందికి ఆబ్ధికాలు ( తద్దినాలు) పెట్టము. అలాంటి వారు బాధ్రపద మాసం అమావాస్య రోజు ( అక్టోబర్ 10)న పూర్వీకులను యథావిథిగా పూజించి... తర్పణాలు వదలితే అంతటి ఫలితం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
