ఇచ్చోడ మేక తింటే మస్త్ టేస్ట్ ఉంటది

ఇచ్చోడ మేక తింటే మస్త్ టేస్ట్ ఉంటది

తెలంగాణలో ఆపదైనా.. సంపదైనా.. ముక్క ఉండాల్సిందే. పండగైనా ఫంక్షనైనా గంపగుత్తగా మేకలను కొనుగోలు చేయడానికి జనం వస్తుంటారు. అలా కొనుగోలు చేస్తే తక్కువ రేటుకు వస్తాయని ఆశ. అందు కోసం మేకల మండీలకు వెళ్తుంటారు. హైదరాబాద్ చుట్టు ప్రక్క ప్రాంతాల వాళ్లు..ఓల్డ్ సిటీతో పాటు..పరిసర ప్రాంతాల్లోని మేకల మండికి వచ్చి మేకలు కొనుగోలు చేస్తుంటారు. హైదరాబాద్కు దూరంగా ఉన్న ఉమ్మడి  కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాల ప్రజలు మేకల కోసం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ మేకలు అగ్వకు దొరకడంతో పాటు మస్తు టేస్ట్ ఉంటయి. 

తెలంగాణలోనే అతిపెద్ద మేకల మార్కెట్గా అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మేకల మార్కెట్ పేరుంది. నిత్యం ఈ మార్కెట్కు వేల సంఖ్యలో మేకలు , గొర్రె పొట్టేళ్లు వస్తుంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజన్ అయితే ఇచ్చోడ మేకల మార్కెట్ కళకళలాడుతుంటుంది. దీంతో పాటు.. ప్రతీ శనివారం, సోమవారం మార్కెట్ అమ్మకందారులు, కొనుగోలుదారులతో మార్కెట్ కిక్కిరిసిపోతుంది. 

ఇచ్చోడ మార్కెట్కు వచ్చే మేకలు అడవిలో ఆకులు, అలములు తిని పెరుగుతాయి. ఉమ్మడి అదిలాబాద్తో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, నాందేడ్ ప్రాంతాల నుంచి ఇక్కడకు వ్యాపారులు మేకలను అమ్మేందుకు తీసుకొస్తారు. అయితే అదిలాబాద్ సరిహద్దు ప్రాంతమంతా అటవీ ప్రాంతం అయినందున ఈ గ్రామాల్లోని మేకలు ఔషధ గుణములున్న ఆకులు తిని జీవిస్తాయి. అలాంటి మేకలు తింటే ఆరోగ్యంతో పాటు... శరీరానికి బలం వస్తుందని కొనుగోలుదారులు భావిస్తారు. పైగా ఇచ్చోడ మార్కెట్లో మేకలు తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో కొద్దిగా దూరమైనా సరే.. ట్రాలీ ఆటోలు, డిసీఎంలలో వచ్చి వ్యాపారులు ఇక్కడ మేకలు కొంటారు.