జపాన్ దేశం అనగానే మనకు గుర్తొచ్చేది క్రమశిక్షణ, సాంకేతికత. కానీ అక్కడ వ్యవసాయ రంగంలో ఒక అద్భుతమైన సంప్రదాయం కొనసాగుతోంది. జపాన్ సూపర్ మార్కెట్‌లలో మీరు పండ్లు, కూరగాయలు కొనడానికి వెళ్తే.. ఆ ప్యాకెట్లపై ఆ పంటను పండించిన రైతు చిరునవ్వుతో ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ రైతు పేరు, ప్రాంతం, వారు పాటించే సాగు పద్ధతుల వివరాలు కూడా అందులో ఉంటాయి.
ఫోటోల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి..?
ఈ పద్ధతిని జపాన్‌లో ట్రేసబిలిటీ అని పిలుస్తారు. దీని వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వినియోగదారులకు తాము తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎవరు పండించారో తెలిస్తే ఒక రకమైన భరోసా కలుగుతుంది. ఫోటో పెట్టడం అంటే ఆ రైతు తన పంట నాణ్యతకు స్వయంగా హామీ ఇస్తున్నట్లు లెక్క. అలాగే సాధారణంగా రైతులు పండించిన పంట మార్కెట్‌కు వెళ్లాక అది ఎవరిదో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ రైతుకు ఒక సెలబ్రిటీ హోదా లభిస్తుంది. తమ ముఖం ప్యాకెట్‌పై ఉందనే బాధ్యతతో రైతులు మరింత నాణ్యమైన, రసాయనాలు లేని పంటను పండించడానికి ఆసక్తి చూపుతారు. చివరిగా నగరాల్లో ఉండేవారు తాము కొనే ప్రతి కూరగాయ వెనుక ఒక రైతు కష్టం ఉందని గుర్తించేలా ఈ ఫోటోలు చేస్తాయి. పైగా ఇది కొనుగోలుదారుడికి, రైతుకు మధ్య ఒక అదృశ్య అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.
జపాన్‌లో వ్యవసాయాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఒక కళగా భావిస్తారు. ఈ ఫోటోల విధానం వల్ల రైతులు కేవలం కూలీలుగా కాకుండా ఆహార సృష్టికర్తలుగా గౌరవించబడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఆ ప్యాకెట్‌పై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేస్తే.. ఆ రైతు పొలంలో పడుతున్న కష్టం, సాగుకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తాయి. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సమాజంలో అపారమైన గౌరవం లభిస్తోంది.
ఇండియా కూడా వ్యవసాయ ఆధారిత దేశమే. మన రైతులు పండించే పంట వల్లే మనం రోజుకు మూడు పూటలా భోజనం చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు రైతు ఎవరో.. వారి కష్టం ఎంతో మనకు తెలియదు. జపాన్ లాంటి ఈ అద్భుతమైన విధానం మన దేశంలో కూడా అమలైతే ఎంత బాగుంటుందో కదా. ప్రతి కూరగాయ ప్యాకెట్‌పై మన భారతీయ రైతు ఫోటో ఉంటే.. రైతుకు దక్కాల్సిన అసలైన గౌరవం దక్కుతుంది. అప్పుడు వినియోగదారులు కూడా రైతు కష్టాన్ని గుర్తించి, గౌరవిస్తారు. ఇలాంటి మార్పు మన దగ్గర కూడా రావాలని కోరుకుందాం.
